బీజేపీ DNA లో ఓట్‌‌‌‌ చోరీ..స‌‌‌‌త్యం,అహింస‌‌‌‌తో మోదీ,ఆర్ఎస్ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ను ఓడిస్తాం

బీజేపీ DNA లో ఓట్‌‌‌‌ చోరీ..స‌‌‌‌త్యం,అహింస‌‌‌‌తో మోదీ,ఆర్ఎస్ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ను ఓడిస్తాం


 

  • సమయం పట్టినా చివరకు సత్యమే గెలుస్తుందిరాహుల్​
  • బీజేపీకి తొత్తుగా ఈసీ పనిచేస్తున్నది.. ఈసీకి సపోర్ట్‌‌‌‌గా కేంద్రం చట్టం తీసుకొచ్చింది
  • కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి రాగానే దాన్ని మార్చేస్తం
  • ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీస్కుంటామని వార్నింగ్‌‌‌‌
  • ‘ఓట్‌‌‌‌ చోర్‌‌‌‌ - గద్దీ చోడ్‌‌‌‌’ పేరుతో ఢిల్లీలోని రామ్‌‌‌‌లీలా మైదానంలో కాంగ్రెస్‌‌‌‌ మహా ధర్నా
  • తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్‌‌‌‌, డిప్యూటీ సీఎం భట్టి..
  •  పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ డీఎన్ఏలో ఓట్ చోరీ ఉంటే..  కాంగ్రెస్ డీఎన్ఏలో సత్యం, అహింస ఉన్నాయని కాంగ్రెస్​ అగ్రనేత, లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌గాంధీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా బీజేపీ కోసం కేంద్ర ఎన్నిక‌‌‌‌ల  సంఘం (ఈసీ) పనిచేస్తున్నదని విమ‌‌‌‌ర్శించారు.  

ఓట్‌‌‌‌ చోరీ లేకపోతే బీజేపీ సర్కారును గద్దె దించడానికి ఎంతో టైం పట్టదని  అన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌‌‌‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్‌‌‌‌ చోర్ గద్దీ చోడ్‌‌‌‌’ మెగా ర్యాలీలో ఆయన మాట్లాడారు.   

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌‌‌‌కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌‌‌‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పేర్లను ప్రస్తావిస్తూ..  వారు బీజేపి కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ అనేది దేశం కోసమని, మోదీకి పరిమితం కాదనే విషయం వారు గుర్తుంచుకోవాలని సూచించారు.

ఎన్నికల సంఘానికి రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) కల్పిస్తూ ప్రధాని మోదీ కొత్త చట్టాన్ని తెచ్చార‌‌ని, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని మారుస్తామని రాహుల్​ తెలిపారు. అవసరమైతే ఎన్నికల సంఘం కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇది సత్యం, అసత్యానికి మధ్య జరుగుతున్న పోరాటమని తెలిపారు.

ఈ ఆందోళన కార్యక్రమానికి కాంగ్రెస్​ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అభిషేక్ మను సింఘ్వీ, జైరామ్ రమేశ్‌‌, చిదంబరం సహా సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ కీలక నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌ కుమార్ గౌడ్ , మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు పాల్గొన్నారు. 

గాంధీ మార్గంలోనే..

ప్రపంచం సత్యం వైపు చూడదని, అధికారం వైపు చూస్తుందని, అధికారం ఉన్నవాడినే గౌరవిస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్లను రాహుల్ గుర్తు చేశారు. ఇది మోహన్ భగవత్ ఆలోచన అని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంత‌‌మ‌‌ని విమ‌‌ర్శించారు. ఐడియాలజీ ఆఫ్ ఇండియా, ఐడియాలజీ ఆఫ్ హిందూయిజం తమ సిద్ధాంతమని పేర్కొన్నారు. 

ప్రపం చంలోని ప్రతి మతం సత్యమే ప్రధానమని చెబుతున్నదని, కానీ..సత్యానికి అర్థమే లేదని, అధికారమే కీలకమని మోహన్ భగవత్ అంటున్నారని విమర్శించారు. ఈ దేశం సత్యం, శివం, సుందరం – సత్యమేవ జయతే అనే తత్వ శాస్త్రంపై నడుస్తున్నదని తెలిపారు. చివరికి  సత్యం, అహింసతోనే.. మోదీని, ఆర్‌‌‌‌ఎస్‌‌ఎస్‌‌ సర్కారును కాంగ్రెస్​ ఓడించి గద్దె దించుతుందని అన్నారు. ఇందుకోసం గాంధీమార్గంలో శాంతియుత, ప్రజాస్వామ పంథాలో పోరాటం సాగిస్తుందని చెప్పారు.  

ఓటర్ల జాబితాలో బ్రెజిలియన్ మహిళ ఫొటోనా?

ఓట్ చోరీపై ఆధారాలతో సహా తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ.. ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వలేదని రాహుల్‌‌గాంధీ మండిపడ్డారు.  హర్యానా ఓటర్ల జాబితాలో ఒక బ్రెజిలియన్ మహిళ ఫొటో 22 సార్లు ఎలా కనిపించింది?  అని  ప్రశ్నించారు. 

హర్యానా ఎన్నికల్లో యూపీకి చెందిన బీజేపీ కార్యకర్తలు ఓట్లు వేశారని ఆరోపించారు. తాళం వేసిన ఒకే ఇంట్లో 600, 700 మంది ఓట్లరు ఉండడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బిహార్‌‌ ఎన్నికల వేళ బీజేపీ రూ.10 వేల చొప్పున పంచినా.. ఈసీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు.  ‘‘ఇది స‌‌త్యం, అసత్యం మధ్య జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో ఎన్నికల సంఘం బీజేపీతో కలిసి పనిచేస్తున్నది. బీజేపీ సర్కారు ఎంత చెబితే అంత అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్నది” అని మండిపడ్డారు. 

మోదీ ఆత్మవిశ్వాసం సడలింది 

ఓట్ చోరీలో దొరికిపోయినట్టు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతోసహా బీజేపీ నాయకులు గ్రహించారని రాహుల్‌‌ గాంధీ అన్నారు. అందుకే ప్రధానితోపాటు ఆ పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసం సడలిందని తెలిపారు. లోక్‌‌సభలో ‘ఓట్ చోరీ’పై చర్చ సంద ర్భంగా.. తన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నప్పుడు అమిత్ షా చేతులు వణికాయని చెప్పారు. 

బీజేపీ నాయకుల ఆత్మవిశ్వాసం, ధైర్యం కేవలం అధికారం నుంచే వస్తాయని, ఆ అధికారాన్ని వారు ఓట్లను దొంగిలించి చేజిక్కించుకున్నారని విమర్శించారు. ‘‘మీరు ఎన్ని ప్రసంగాలు చేసినా, అంతిమంగా సత్యానిదే విజయం. మేం మిమ్మల్ని సత్యం, అహింసతో ఓడిస్తాం” అని మోదీ, అమిత్‌‌ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.