- మృతుల్లో పోలీసు, ఓ నిందితుడు కూడా.. 29 మందికి గాయాలు
- యూదుల హనుక్కా కార్యక్రమమే లక్ష్యంగా ఇద్దరు ముష్కరుల కాల్పులు
- ఓ దుండగుడిని గుర్తించి విచారిస్తున్న పోలీసులు
- టెర్రర్ దాడేనని న్యూ సౌత్ వేల్స్ పోలీసుల ప్రకటన
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్ లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో బీచ్ లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, ఓ ముష్కరుడు సహా 11 మంది మృతిచెందారు. మరో 29 మంది పర్యాటకులకు గాయాలయ్యాయి. యూదుల పండుగ ప్రారంభం సందర్భంగా బాండీ బీచ్‌లో ఆదివారం సాయంత్రం ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
పర్యాటకులందరూ ఆనందంగా గడుపుతున్న సమయంలో నల్లటి ముసుగులు ధరించి వచ్చిన దుండగులు.. షాట్‌గన్స్‌తో ఫైరింగ్ మొదలెట్టారు. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్న వంతెనపైనుంచి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే భద్రతా దళాలు రంగంలోకి దిగి దుండగులను అదుపులోకి తీసుకొనే ప్రయత్నించారు.
ఓ దుండగుడు తప్పించుకు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరపడంతో చనిపోయాడు. గాయపడిన మరో దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. హెలికాప్టర్లు, 30 అంబులెన్స్‌లను ఘటనా స్థలంలో మోహరించి.. క్షతగాత్రులను దవాఖానకు చేర్చారు. ఇది ‘టెర్రర్ దాడే’నని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యోన్ ప్రకటించారు.
యూదుల కార్యక్రమే లక్ష్యంగా..
న్యూసౌత్ వేల్స్ రాష్ట్రం సిడ్నీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బాండీ బీచ్‌లో ఆదివారం సాయంత్రం ఎనిమిది రోజుల యూదుల పండుగ ‘హనుక్కా’ ఆరంభ వేడుకలు మొదలయ్యాయి. ఇందుకోసం వందలాది మంది గుమిగూడారు. ఈ సమయంలోనే దుండగులు కాల్పులు మొదలుపెట్టారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా ఫైరింగ్ చేశారు.
బుల్లెట్ గాయాలతో కొందరు రక్తం మడుగులో పడిపోగా.. మరికొందరు భయంతో పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్, న్యూసౌత్‌వేల్స్ ప్రీమియర్‌తో తాను మాట్లాడినట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలోని వారు పోలీసుల సూచనలు, ఆదేశాలను పాటించాలని కోరారు. ఇదిలా ఉండగా.. అల్బనీస్ సర్కారు నిర్లక్ష్యం వల్లే కాల్పులు చోటుచేసుకున్నాయని ఆస్ట్రేలియన్ యూదు సంఘం మండిపడింది.
దేశంలోని యూదులు ఇప్పుడు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని పేర్కొంది.
దుండగుడిని గుర్తించిన భద్రతా బలగాలు కాల్పులకు తెగబడిన ఇద్దరు దుండగుల్లో ఒకరిని భద్రతా బలగాలు గుర్తించాయి. నిందితుడు 24 ఏండ్ల నవీద్ అక్రమ్ సిడ్నీ సౌత్-వెస్ట్ ప్రాంతంలోని బోన్నీరిగ్ నివాసి అని తేల్చారు. సిడ్నీలోని అక్రమ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ ఘటనలో మూడో వ్యక్తి కూడా ఉండొచ్చనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా, గుర్తించిన నిందితుడు ముస్లిం కావడంతో ఆస్ట్రేలియా ముస్లిం సంఘం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.
దుండుగులతో ఒట్టిచేతులతో పోరాడిన యువకుడు
సిడ్నీ బీచ్‌లో దుండగులు కాల్పులు జరుపుతుండగా.. ఓ వ్యక్తి టెర్రరిస్టును ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వందల మంది ప్రాణాలు కాపాడి రియల్ హీరోగా నిలిచాడు. కాల్పులు జరుపుతున్న ముష్కరుడి వెనుకనుంచి వెళ్లి చేతులోని తుపాకిని లాక్కున్నాడు. అతడిపైనే గన్ ఎక్కుపెట్టాడు. దీంతో అతడు పారిపోగా.. రెండో ముష్కరుడు కాల్పులు ఆపేశాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా.. ప్రస్తుతం దీనికి సంబంధిం చిన వీడియో వెలుగులోకి వచ్చింది.
ఉగ్ర దాడి దారుణం: మోదీ
న్యూఢిల్లీ: బాండీ బీచ్‌లో జరిగిన టెర్రర్ దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. యూదుల హనుక్కా పండుగ మొదటి రోజును లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు కాల్పులు జరపడం దారుణమని అన్నారు. ‘‘టెర్రర్ దాడిలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు భారత ప్రజల తరఫున నా ప్రగాఢ సానుభూతి.
ఈ దుఃఖ సమయంలో ఆస్ట్రేలియా ప్రజలకు అండగా నిలబడతాం. టెర్రరిజాన్ని సహించబోం. ఏ రూపంలో ఉన్నా సరే టెర్రరిజానికి వ్యతిరేకంగా జరిపే పోరాడటాలకు మద్దతిస్తం” అని మోదీ చెప్పారు. టెర్రర్ అటాక్‌ను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో పాటు ప్రపంచ నాయకులు కూడా తీవ్రంగా ఖండించారు. టెర్రర్ దాడిలో గాయపడిన వారికి, బాధితులకు ఫ్రాన్స్ అండగా నిలుస్తుందని ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్ పేర్కొన్నారు.
