IPL 2025: సెంచరీతో హోరెత్తించిన రాహుల్.. గుజరాత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్!

IPL 2025: సెంచరీతో హోరెత్తించిన రాహుల్.. గుజరాత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్!

ఐపీఎల్ 2025 లో కీలక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సత్తా చాటింది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే కీలకంగా మారిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేసింది. ఆదివారం (మే 18) అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రాహుల్(65 బంతుల్లో 112*:14 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో పాటు అభిషేక్ పోరెల్ (30), కెప్టెన్ అక్షర్ పటేల్ (25) కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్, అర్షద్ ఖాన్, ప్రసిద్ కృష్ణలకు తలో వికెట్ దక్కింది. 

ALSO READ | RR vs PBKS: ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్.. ఛేజింగ్‌లో రాజస్థాన్‌కు మరో భంగపాటు

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన ఢిల్లీకి మంచి ఆరంభం లభించలేదు. ఆ జట్టు నాలుగో ఓవర్లోనే డుప్లెసిస్ వికెట్ కోల్పోయింది. క్రీజ్ లో ఉన్నత వరకు పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన డుప్లెసిస్.. 10 బంతుల్లో 5 పరుగులే చేసి ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ తొలి 5 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే చేయగలిగింది. రబడా వేసిన ఆరో ఓవర్లో ఢిల్లీ పుంజుకుంది. ఈ ఓవర్లో రాహుల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టడంతో 17 పరుగులు వచ్చాయి. రాహుల్ తో పాటు మరో ఎండ్ లో అభిషేక్ పోరెల్ బ్యాట్ ఝుళిపించడంతో స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. 

ALSO READ | IND vs ENG: ఇంగ్లాండ్ సిరీసే టార్గెట్: కఠిన డైట్ చేస్తూ 10 కేజీలు తగిన టీమిండియా క్రికెటర్

ఈ క్రమంలో రాహుల్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్ కు 90 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ పోరెల్ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రాహుల్ కెప్టెన్ అక్షర్ పటేల్ తో మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మూడో వికెట్ కు రాహుల్ తో కలిసి 45 పరుగులు జోడించిన తర్వాత అక్షర్ 25 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా ఓపెనర్ గా వచ్చిన రాహుల్ చివరి వరకు బ్యాటింగ్ చేశాడు. స్టబ్స్ సహకారంతో 60 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని జట్టుకు భారీ స్కోర్ అందించాడు. చివర్లో స్టబ్స్ 10 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు.