
స్టాక్ మార్కెట్లు చాలా ఓలటాలిటీని కలిగి ఉంటాయి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాలతో పాటు దేశంలోని అనేక అంశాలు దీనితో ముడిపడి ఉంటాయని మనందరికీ తెలిసిందే. అందుకే ఇన్వెస్టర్లకు నిపుణులు లేదా సీనియర్ ఇన్వెస్టర్లు చెప్పే ఒక సూత్రం ఖచ్చితంగా లాభాలను తెచ్చిపెట్టగలదని మరోసారి రుజువైంది.
గడచిన వారం భారతీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల నుంచి తేరుకుని ఏకంగా ఇన్వెస్టర్ల సంపదను రూ.26 లక్షల కోట్ల మేర పెంచిన సంగతి తెలిసిందే. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఏకంగా 4 శాతం లాభపడ్డాయి. దీనికి ముందు జరిగిన పెహల్గామ్ ఎటాక్ నుంచి ఆపరేషన్ సిందూర్, అమెరికా ఇండియా వాణిజ్య డీల్ వంటి అంశాలు మార్కెట్లను క్షీణింపజేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అప్పటి నష్టాల నుంచి మార్కెట్లు భారీగా పెరుగుదలను నమోదు చేశాయి.
ALSO READ | Monday Markets: గతవారం రూ.26 లక్షల కోట్లు లాభం.. మరి కొత్తవారం పరిస్థితి ఏంటి..?
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు సురక్షితమని దేశీయ బ్రోకరేజ్ సంస్థ రెలిగేర్ ప్రతినిధి అజిత్ మిశ్రా పేర్కొన్నారు. మార్కెట్లు తిరోగమనంలో ఉన్నప్పుడు లేదా అనుకోని పరిస్థితులతో నష్టాల బారిన పడినప్పుడు దానిని ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడులకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. బై ఎట్ డిప్స్ విధానంతో ప్రయోజనాలను వినియోగించుకోవాలని వారు సూచించారు. అయితే ఈ సమయంలో మంచి ఫండమెంటల్స్ ఉన్న షేర్లను నమ్ముకోవటం రిస్కుకు తగిన రివార్డును అందిస్తుందని పేర్కొన్నారు.
గతవారం దేశీ యస్టాక్ మార్కెట్లలో మనం గమనిస్తే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలోని అనేక షేర్లు మంచి ర్యాలీని చూశాయి. అలాగే పాక్ భారత్ యుద్ధం వరకు వెళ్లటంతో ప్రస్తుతం అనేక డిఫెన్స్ స్టాక్స్, షిప్ బిల్డింగ్ కంపెనీలకు చెందిన షేర్లు మంచి పెరుగుదలను చూస్తున్నాయి. అలాగే క్యూ4 కార్పొరేట్ ఫలితాలు సైతం ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండటం మార్కెట్లను ముందుకు నడిపిస్తోంది. ఈ క్రమంలో ఏదైనా మార్కెట్ పతనాన్ని పెట్టుబడి అవకాశంగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.