టీఎంసీ ఎమ్మెల్యే భార్యకు రూ. కోటి లాటరీ

టీఎంసీ ఎమ్మెల్యే భార్యకు రూ. కోటి లాటరీ

కోల్​కతా: లాటరీల పేరుతో తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ(టీఎంసీ) మనీ లాండరింగ్​కు పాల్పడుతోందని బెంగాల్​ అపోజిషన్​ లీడర్​ సువేందు అధికారి ఆరోపించారు. టీఎంసీ ఎమ్మెల్యే వివేక్​ గుప్తా భార్యకు కోటి రూపాయల లాటరీ తగిలిందనడంలో నిజంలేదని విమర్శించారు. అధికార పార్టీ నేతలు లాటరీ పేరుతో మనీ లాండరింగ్​కు పాల్పడుతున్నారని ఆరోపించారు. సాధారణ జనాలు కూడా లాటరీ టికెట్లు కొంటున్నా.. బంపర్​ ప్రైజులు టీఎంసీ లీడర్లకే తగులుతు న్నాయని అన్నారు. 

ఇటీవలే టీఎంసీ నేత అనుబ్రతా మండల్​ కోటి రూపాయల బంపర్​ ప్రైజ్​ గెలుచుకున్నారని, ఇప్పుడు ఎమ్మెల్యే  భార్యకు కోటి రూపాయలు వచ్చాయని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షాకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ‘డియర్​ లాటరీ’  కంపెనీకి లావాదేవీలపై ఇన్వెస్టిగేషన్​ చేయాలని కోరామన్నారు. సువేందు విమర్శలపై టీఎంసీ ఎమ్మెల్యే వివేక్​ గుప్తా స్పందించారు. తన భార్యపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. ‘‘నా భార్యకు రాజకీయాల తో ఎలాంటి సంబంధంలేదు. లాటరీ కంపెనీ లను ఇన్​ఫ్లూయెన్స్​ చేసేంత పవర్​ ఉందని నాకే తెలియదు”అని వివేక్​ గుప్తా అన్నారు.