బీఆర్ఎస్ ను తరిమికొట్టే టైం వచ్చింది : పాయల్ శంకర్

బీఆర్ఎస్ ను తరిమికొట్టే టైం వచ్చింది : పాయల్ శంకర్

ఆదిలాబాద్/జైనథ్​, వెలుగు : గత ఎన్నికల మెనిఫెస్టోలో చూపించిన ఏ ఒక్క హామీని ఎమ్మెల్యే జోగురామన్న నెరవేర్చలేదని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను తరిమికొట్టే టైం వచ్చిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం జైనథ్ మండలం నీరాలలో శక్తి కేంద్ర ఇన్​చార్జిలు, బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. హామీల కోసం ప్రజలు నిరీక్షించేది లేదని, బీఆర్ఎస్ పార్టీపై, జోగు రామన్న పై యుద్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

బీజేపీ అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఆయుష్మాన్ భారత్​పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా,  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్, నాయకులు విజయ్ లోకా ప్రవీణ్ రెడ్డి, గజానంద్, ప్రవీణ్, రమేశ్, కరుణాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి, సుభాష్, గేడం శివ కార్యకర్తలు పాల్గొన్నారు.

స్వచ్చ భారత్ అతిపెద్ద మైలురాయి 

స్వచ్చ భారత్ దేశంలోనే అతిపెద్ద మైలురాయి అని పాయల్ శంకర్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ‘స్వచ్ఛాంజలి’  కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో స్వచ్ఛాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు.