బీజేపీకి ‘మున్సిపల్’ సవాల్.. సొంత నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్ష

బీజేపీకి ‘మున్సిపల్’ సవాల్..  సొంత నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్ష
  • టౌన్లలో సత్తా చాటేందుకు కమలనాథుల వ్యూహాలు
  • ఫలితాల ప్రభావం జీహెచ్​ఎంసీ ఎన్నికలపై పడే చాన్స్ 
  • ఈ నెలలోనే నోటిఫికేషన్!  
  • పోరును సీరియస్‌‌‌‌గా తీసుకున్న నేతలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నెలలోనే నోటిఫికేషన్  వచ్చే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. అయితే, ఈ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అర్బన్ లో తమకు తిరుగులేని పట్టు ఉందని చెప్పుకునే కమలం లీడర్లు.. క్షేత్రస్థాయిలో ఆ మాటను నిజం చేసి చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంపీలు, ఎమ్మెల్యేల సొంత నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జెండా ఎగరేయడం కమలం నేతలకు అగ్నిపరీక్షగా మారింది.

ఈ ఫలితాలు రాబోయే జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో.. పార్టీ హైకమాండ్  ఈ పోరును సీరియస్‌‌‌‌గా తీసుకుంది. బీజేపీకి మొదటి నుంచి ‘అర్బన్ పార్టీ’ అనే ముద్ర ఉంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్  గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో టౌన్లలో తమ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. 

కరీంనగర్, నిజామాబాద్, పాలమూరుపై స్పెషల్ ఫోకస్ 

మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోకపోతే, అది బీజేపీ గ్రాఫ్‌‌‌‌  పడిపోవడానికి సంకేతంగా మారుతుందని వాదనలు ఉన్నాయి. దీంతో ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కేడర్‌‌‌‌ను లీడర్లు సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 125 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలతో దాదాపు అన్ని చోట్ల డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను రిలీజ్ చేశారు. త్వరలోనే నోటిఫికేషన్  రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఈ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్  కార్పొరేషన్లు బీజేపీకి కీలకంగా మారాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్  ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్​లో బీజేపీకి మంచి పట్టుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా.. ప్రస్తుతం ఈ బల్దియాను గెలిచేందుకు వ్యూహరచన చేస్తున్నారు. నిజామాబాద్ లో ఎంపీ అర్వింద్, అర్బన్  ఎమ్మెల్యే ధన్‌‌‌‌పాల్  సూర్యనారాయణ ఉన్నారు. సిట్టింగ్  ఎమ్మెల్యే, ఎంపీ ఉన్న చోట కార్పొరేషన్  చేజారితే అది పార్టీకి పెద్ద డ్యామేజ్ అవుతుంది.

దీంతో ఎలాగైనా గెలవాలని ఆయా నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో లార్జెస్ట్ పార్టీగా ఉన్నా.. మెజారిటీ సీట్లు రాకపోవడంతో చైర్మన్  పదవి దక్కలేదు. మరోపక్క ఎంపీ డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న పాలమూరులో సత్తా చాటాలని పార్టీ భావిస్తోంది. ఈ మూడు చోట్ల మేయర్  పీఠమే లక్ష్యంగా పార్టీ స్పెషల్  ఫోకస్ పెట్టింది. మంచిర్యాల, రామగుండంలో అంతో ఇంతో ప్రభావం చూపినా.. కొత్తగూడెంలో అంతంత మాత్రమే బీజేపీ ప్రభావం ఉంది. 

గ్రేటర్ ఎన్నికలకు సెమీఫైనల్స్..

త్వరలో జరగబోయే గ్రేటర్  హైదరాబాద్ ఎన్నికలకు ఈ మున్సిపల్  ఎన్నికలు సెమీఫైనల్స్‌‌‌‌  లాంటివి. జిల్లాల మున్సిపాలిటీల్లో బీజేపీ హవా కనిపిస్తే, ఆ జోష్  హైదరాబాద్  క్యాడర్‌‌‌‌లోనూ కనిపిస్తుంది. ఫలితాలు తేడా కొడితే.. దాని ప్రభావం గ్రేటర్  ఎన్నికలపై పడే ప్రమాదం ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ పోరులో పైచేయి సాధించాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమతమ నియోజకవర్గాల్లో బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది.

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నిర్మల్  మున్సిపాలిటీ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి కామారెడ్డి బల్దియా, ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి ఆర్మూరు మున్సిపాలిటీలు అగ్నిపరీక్షగా మారాయి. అటు బోథ్  ఎమ్మెల్యే రామారావు పటేల్, సిర్పూర్  ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్, ఆదిలాబాద్  ఎమ్మెల్యే పాయల్  శంకర్  తమ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు గెలిపించుకోవాల్సిందేననే పట్టుదలతో ఉన్నారు.