తెలంగాణకు బీజేపీ, బీఆర్ఎస్ చేసిందేమీలేదు : మంత్రి దామోదర రాజనరసింహ

తెలంగాణకు బీజేపీ, బీఆర్ఎస్ చేసిందేమీలేదు : మంత్రి దామోదర రాజనరసింహ

రాయికోడ్, వెలుగు : పదేండ్ల బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు.  మంగళవారం  సంగారెడ్డి జిల్లా రాయికోడ్​ మండలంలోని పటేల్ ​ఫంక్షన్​హాల్​లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్​ ముఖ్య కార్యకర్తల సమావేశానికి జహీరాబాద్​ కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్​తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్​ ప్రభుత్వాలు బడా బాబులకు దోచి పెట్టాయే తప్పా అభివృద్ధి చేయలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీకి తెలంగాణ ప్రజలు గుణపాఠం  చెప్పారని, పార్లమెంట్​ఎన్నికల్లో బీజేపీకి కూడా ఇదే గతి పడుతుందన్నారు. 

ఉమ్మడి ఏపీలో రాయికోడ్​కు నేషనల్​ స్పోర్ట్స్​ కాలేజీని మంజూరు చేస్తే బీఆర్ఎస్​ ప్రభుత్వం  దానిని సిద్దిపేటకు తరలించి ఈ ప్రాంత  ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కానీ, ఏ ఒక్కరూ అడ్డుకోకపోవడంతో తాను మనస్తాపానికి గురైనట్టు చెప్పారు. సిరూర్, పీపడ్ పల్లి, రామోజిపల్లి, నల్లంపల్లి, తదితర గ్రామాల బీఆర్ఎస్  నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్​ లీడర్  సుభాష్​రెడ్డి, ఎంపీపీ మొగులప్ప, జడ్పీటీసీ మల్లికార్జున్​పాటిల్, బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు అంజయ్య, కాంగ్రెస్​ పార్టీ మండల  అధ్యక్షుడు బాలాజీ  నర్సింహులు, పీఏసీఎస్​ చైర్మన్ నాగిశెట్టి, డీసీసీబీ మాజీ చైర్మన్​ సిద్దన్న పాటిల్​,  ఏఎంసీ మాజీ  చైర్మన్లు కేదార్​నాథ్​ పాటిల్, ఏసప్ప, నాయకులు సుభాష్ ​పాటిల్, ప్రభాకర్, బస్వరాజ్ ​పాటిల్  పాల్గొన్నారు.