బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల్లో అటెన్షన్​

బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల్లో అటెన్షన్​
  • బీజేపీ సెకండ్ లిస్ట్ రేపే రిలీజ్?!
  • ఢిల్లీకి కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్
  • హస్తినలో కాంగ్రెస్ లీడర్ల ఉత్కంఠ 
  • సమావేశమైన కాంగ్రెస్ సీఈసీ 
  • మారుతున్న రాజకీయ సమీకరణాలు
  • పలుసీట్లను పెండింగ్ లో పెట్టే చాన్స్

హైదరాబాద్ : అసెంబ్లీ అభ్యర్థుల సెకండ్ రిలీజ్ కు బీజేపీ, కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నాయి. పొత్తుల అంశంపై చర్చించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పార్టీ సైతం సెకండ్ లిస్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నది. ఇతర పార్టీల నుంచి కీలక నేతలు చేరే అవకాశమున్న స్థానాలను పెండింగ్ లో పెట్టే అవకాశాలున్నాయని సమాచారం.

బీజేపీ 52 స్థానాలకు, కాంగ్రెస్ 55 స్థానాలకు మొదటి జాబితాలో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుల అంశాన్ని ఏఐసీసీ తేల్చనుంది. సీపీఐ కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను కోరుతున్నది. సీపీఎం విషయంలో క్లారిటీ రాలేదు. చెరో రెండు స్థానాలు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఒక్కో స్థానమే కేటాయిస్తారనే వాదన ఉంది. నాలుగు సీట్లు ఆశించిన జనసేనకు ఈ సారి ఒక్క సీటైనా ఇస్తారా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. 

64 సీట్లను పెండింగ్ లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి జాబితాను రేపు ఉదయం విడుదల చేస్తుందని స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు. అయితే అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తుందా..? కొన్నింటిని పెండింగ్ లో పెట్టి చేరికల తర్వాత రివిల్ చేస్తుందా..? అన్న సందేహాలున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణలో పోటీ చేయబోయే అభ్యర్థుల రెండో విడుత జాబితాను తేల్చేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ సమావేశమైంది. మూడున్నర గంటల పాటు ఈ సమావేశం సాగింది. అయితే జాబితాను రేపు ఉదయం ప్రకటించే అవకాశం ఉంది. 

ఎల్లుండి రాజగోపాల్ రెడ్డి హస్తం కండువా కప్పుకొనే అవకాశం ఉంది. ఆయన మునుగోడు నుంచి తిరిగి పోటీ చేయనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో చేరకముందే టికెట్ ప్రకటించే అవకాశం లేదు. ఇలాంటి కొన్ని సెగ్మెంట్లను పెండింగ్ లో పెడుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా టికెట్లు ఆశిస్తున్న పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేశారు. తమకు పరిచయం ఉన్న ఏఐసీసీ నేతల ద్వారా చివరి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక పోతే బీజేపీ, జన సేన మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. 

పొత్తులో భాగంగా మొత్తం 20 స్థానాలను జనసేన కోరుతోంది. 6–10 కేటాయించేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఏయే స్థానాలు కేటాయించాలనే అంశం ఢిల్లీలో జాతీయ నేతల సమక్షంలో తేలే అవకాశం ఉంది. అయితే జనసేన తమకు కూకట్ పల్లి, శేరిలింగంపల్లితోపాటు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని పలు స్థానాలు కేటాయించాలని కోరుతున్నట్టు సమాచారం. ఏయే సెగ్మెంట్లను జనసేనకు కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.