కులగణనపై ఎవరికివారే..! బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్..

కులగణనపై ఎవరికివారే..! బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్..

దేశమంతటా  పహల్గాంపై  వాడివేడీగా చర్చలు  జరుగుతున్నవేళ  కేంద్ర ప్రభుత్వం దేశంలో కులగణనకు పచ్చజెండా ఊపడం సంచలనమే. 2014 నుంచి  దేశ రాజకీయాల్లో  నరేంద్రమోదీ శకం ప్రారంభమయ్యాక ప్రతిపక్షాలు కులగణన అంశాన్ని అస్త్రంగా చేసుకున్నాయి.  

దేశవ్యాప్తంగా సామాజిక వర్గాల గణాంకాలు సేకరించాలనే ఒత్తిడి పెరుగుతుండటంతో  బీజేపీ ప్రభుత్వం ఎట్టకేలకు కులగణనకు ఆమోదం తెలిపింది.  దీన్ని ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తమ విజయంగా చెప్పుకుంటుంటే,  కులగణన చేయాలని నిర్ణయించిన బీజేపీ కాంగ్రెస్​పై  విమర్శలు కురిపించింది.

ప్రస్తుతం  కులగణన చుట్టూ రాజకీయాలు ప్రారంభమైనవేళ ఇందుకు సంబంధించిన పూర్వాపరాలు పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి.  బ్రిటిష్ ప్రభుత్వం 1881 నుంచి 1931 వరకు  భారతదేశంలో జనాభా లెక్కలను కులాలవారీగా సేకరించింది.  స్వాతంత్ర్యం అనంతరం దేశంలో 1951లో తొలిసారిగా చేపట్టిన జనాభా లెక్కల్లో అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ సూచనల మేరకు కులగణన చేపట్టకుండా కేవలం ఎస్సీ, ఎస్టీ లెక్కలనే సేకరించారు. 

అనంతరం జరిగిన 1961 జనాభా లెక్కల్లో కూడా కులగణన చేయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు సొంతంగా ఓబీసీ లెక్కలను సేకరించుకోవచ్చని సూచించింది. అనంతరం నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకు 1971, 1981, 1991, 2001లో జనగణన జరిగిన సమయంలో కులగణన కూడా చేపట్టాలని డిమాండ్లు వచ్చినా నిర్వహించలేదు.  

అయితే, 2011లో  మన్మోహన్ సింగ్  ప్రభుత్వం  జనగణనతోపాటు సామాజిక, ఆర్థిక, కుల వివరాలను కూడా సేకరించినా కేవలం జనాభా లెక్కలను మాత్రమే బహిర్గతం చేశారు. ఆనాటి లెక్కల్లో పలు అవకతవకలు జరిగాయనే గందరగోళంతో కులగణన వివరాలను బయటపెట్టలేదు. 

జనగణనలో కులగణన

మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రత్యేకంగా కులగణనకు పరిమితం కాకుండా సామాజిక, ఆర్థిక, కుల వివరాల సేకరణ జరపాలని నిర్ణయించింది.  దీనిపై అప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది.  అప్పటి లోక్​సభ  ప్రతిపక్షనేత  సుష్మాస్వరాజ్ జనాభా లెక్కల్లో  భాగంగా కులగణన చేపట్టాలని కోరగా,  నాటి  హోంమంత్రి పి.చిదంబరం మాత్రం జనగణనతో పాటు కులగణన నిర్వహించడం కష్టసాధ్యమని సమాధానం ఇచ్చారు.  

అనంతరం దేశంలో రాజకీయాలు మారాయి.  ఇప్పుడు  ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్  జనాభా లెక్కల్లో భాగంగా కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేస్తుంటే, దాన్ని దాటవేస్తూ వస్తున్న బీజేపీ ఎట్టకేలకు రాబోయే జనాభా లెక్కల్లో కులాలవారీగా వివరాలు సేకరిస్తామని తెలియజేసింది.  భారత  రిజిస్ట్రార్  జనరల్ నేతృత్వంలో 2011లో  నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కులగణనలో  కులాలను, ఉప కులాలను, ఇతరులను 46,73,034 వర్గాలుగా విభజించారు.  

]ఈ వివరాలపై అభిప్రాయాలు కోరుతూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2014 నవంబర్లో అన్ని రాష్ట్రాలకు జాబితాలు పంపింది.  వీటిలో 81,958,314 పొరపాట్లు ఉన్నట్లు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి  కేంద్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. వీటిలో 67 మిలియన్ల పొరపాట్లు సరిచేసినా, 14.5 మలియన్ల తప్పులతడకలు అపరిష్కృతంగానే మిగిలాయి. దేశంలో  కులాల లెక్కలు కాగితాలకే పరిమితమయ్యాయి.

దేశంలో కీలకాంశంగా కులగణన

కేంద్రంలో దీర్ఘకాలికంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కొనసాగుతున్నవేళ దేశంలో కులగణన కీలకాంశంగా మారింది.  కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ముక్తకంఠంతో కోరుతుండగా, అధికార బీజేపీ  ప్రతిపక్ష పార్టీలను  విమర్శిస్తూ  కాలయాపన చేసింది.  కేంద్రప్రభుత్వం కులగణనకు సుముఖంగా  లేకపోవడంతో  కొన్ని రాష్ట్రాలు సొంతంగా కులాలవారీగా లెక్కలు చేపట్టాయి.  

బిహార్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కులగణన నిర్వహించాయి. 2023లో  బిహార్లో నితీష్ కుమార్ నిర్వహించిన కులగణనలో ఓబీసీలు, ఈబీసీలు 63 శాతం ఉన్నట్లు తేలింది. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 2015లో చేపట్టిన కులగణన సర్వే 2018 నాటికి పూర్తయినా ప్రభుత్వం మారడంతో పెండింగ్​లో  పడింది.  

2023లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో 2024లో బీసీ కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 69.6శాతం బీసీలు ఉన్నట్టు తేలింది. అయితే  ప్రభుత్వం అధికారికంగా దీన్ని ఆమోదించలేదు.  జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలో  కులగణనపై తీర్మానాలు చేసినా నిర్వహించలేదు. 

దేశంలో మళ్లీ రాజకీయ వేడి

తెలంగాణలో  కులగణన పూర్తిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెనువెంటనే జనాభా ఆధారంగా బీసీలకు స్థానిక ఎన్నికల్లో,  ఉద్యోగ, ఉపాధిరంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పాస్ చేయడంతో  ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్​పై  ఒత్తిడి పెరిగింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేయడంతో కులగణన అంశం జాతీయ స్థాయిలో వేడి పుట్టించింది. 

ఏదేమైనా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కులగణన చేపట్టాలని తాజాగా నిర్ణయించడం వెనుక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభావం కూడా ఉందనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం వలే  స్పష్టత ఇవ్వలేకపోతుంది.  

సిద్ధరామయ్య ప్రభుత్వం కులగణనను ఆమోదించడంలో రాష్ట్ర మంత్రివర్గంలో విభేదాలు రావడంతో ఆమోదంలో ఆలస్యమవుతుంది. బీజేపీ ప్రభుత్వం ఇంతకాలం కులగణనను విమర్శిస్తూ ఇప్పుడు జనాభా లెక్కల్లో భాగంగా కులాలవారీగా కూడా చేపట్టాలని నిర్ణయించడంతో దేశంలో మళ్లీ రాజకీయ వేడి పుట్టింది. ఇది కాంగ్రెస్  గెలుపుగా ఆ పార్టీ చెప్పుకుంటుంటే,  గతంలో కాంగ్రెస్ కులగణనను పక్కనపెట్టింది. ఇప్పుడు చేసిన కొన్ని రాష్ట్రాల లెక్కలు కూడా తప్పులతడకంటూ బీజేపీ విమర్శిస్తోంది. 

ఎవరికివారే  పొలిటికల్ గేమ్​

గతంలో కులగణన పేరు ఎత్తితేనే ఎగిరిపడే బీజేపీలో ఇప్పుడు మార్పుకు అనేక కారణాలున్నాయి. కులగణన డిమాండ్ చేసినవారిని అర్బన్ నక్సల్స్ అని, దేశాన్ని కులాల పేరుతో విభజించడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ పలు మార్లు ప్రతిపక్షాలను విమర్శించింది. ప్రస్తుతం బీజేపీ తన నిర్ణయం మార్పుకోవడంలో రాజకీయ కోణాలున్నాయి. ఇంతకుముందే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన బీజేపీ ఇప్పుడు కులగణనకు ఓకే చెప్పింది. 

హిందుత్వ రాజకీయాలపై ఆధారపడిన బీజేపీ అధికశాతం ఉన్న బీసీలను దూరం చేసుకుంటే జరిగే నష్టాలను అంచనా వేసుకొని ఇప్పుడు కులగణనపై కీలక నిర్ణయం తీసుకుంది. హిందుత్వంతో పాటు బీసీలను కూడా ఓటు బ్యాంకుగా మల్చుకొని ఆరునెలల్లో జరగనున్న బిహార్లో లబ్ది పొందాలని, అనంతరం ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే  సుదీర్ఘ ఆలోచనతో బీజేపీ ఈ పాచికను వేసింది. 

జనాభా లెక్కలతో కులగణన కూడా చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే దేశంలో కులగణనపై ఎవరికివారే పొలిటికల్​ గేమ్​ ప్రారంభించారు. ఆ  క్రెడిట్ పొందడానికి రాజకీయ పార్టీలు ముందువరుసలో ఉన్నాయి.   జనాభా లెక్కలతో కులగణన అనగానే కులాలు, రిజర్వేషన్లు అనే ఆలోచనలే కలగడం సహజం. కానీ, అసమానతలు తొలగిపోయేందుకు కులగణన కీలకంగా ఉపయోపడుతుంది. 

కులగణనతో తెలంగాణ సర్కారుకు ప్రత్యేక గుర్తింపు

కులగణనతో  తెలంగాణ ప్రభుత్వానికి దేశంలో ప్రత్యేక గుర్తింపు లభించింది.  అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కులగణపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక చర్యలు తీసుకొని కులగణన పూర్తి చేసింది.  తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన కోసం రూ.160 కోట్లు కేటాయించింది.   సీఎం రేవంత్ రెడ్డి కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేగవంతంగా పూర్తి చేశారు. 

2024 ఫిబ్రవరి 24వ తేదీన కులగణన సర్వే ప్రక్రియ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం 2024 డిసెంబర్ 25వ  తేదీన పూర్తి చేసింది. మొదటి దఫాలో ఎవరైనా సర్వేలో పాల్గొనకపోతే వారి నుంచి మరోసారి వివరాలు తీసుకున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 98 శాతం జనాభా నుంచి  వివరాలు  సేకరించారు.  రాష్ట్రంలో  కులగణన కోసం 1.03 లక్షల మంది ఉద్యోగులను, 75 వేలకుపైగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించి నిర్దేశించుకున్న సమయంలోగా విజయవంతంగా పూర్తి చేశారు. తెలంగాణలో  బీసీలు 56.33 శాతం ఉన్నట్టు కులగణన లెక్కలు తేల్చాయి. అయితే ఇందులో ముస్లింలను కలపడంపై బీజేపీ,  బీసీలను తగ్గించారంటూ బీఆర్ఎస్ పార్టీలు విమర్శిస్తున్నాయి. 

- ఐ.వి.మురళీకృష్ణ శర్మ,
సోషల్​ ఎనలిస్ట్