చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయిన లేడీ డాక్టర్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని సతారాలో ఎస్సై వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న 29 ఏళ్ల డాక్టర్ కు సంబంధించిన నాలుగు పేజీల సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేధింపుల వెనుకఎస్సైతో పాటు మరో సాఫ్ట్ వేర్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ప్రశాంత్ బంకర్ అనే ఐటీ ఉద్యోగిని అరెస్టు చేశారు. నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడిన ఎస్సై గోపాల్ బదానే కోసం గాలింపులు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ దోషీ చెప్పిన వివరాల ప్రకారం.. లేడీ డాక్టర్ ఫల్తాన్ లోని ఓ హోటల్ లో రూమ్ బుక్ చేసుకుంది. హోటల్ గదిలో నుంచి గంటలు గడిచినా బయటకు రాకపోవడంతో డోర్ నాక్ చేయగా.. ఉరేసుకుని చనిపోయినట్లు హోటల్ సిబ్బంది గుర్తించినట్లు ఎస్పీ చెప్పారు.
లెటర్ లో తను సూసైడ్ ఎందుకు చేసుకుంటున్న వివరాలు రాసింది డాక్టర్. ఒక స్థానిక ఎంపీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలోకి వచ్చి పోస్ట్ మార్టమ్ రిపోర్టు మార్చి రాయాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు తెలిపింది. ఎంపీకి ఫోన్ చేసి మాట్లాడించారని.. ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వాలని బెదిరించినట్లు పేర్కొంది. నిందితుడిని కనీసం చూడకుండా ఫిట్ నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని బెదిరించారని తెలిపింది. కాదనటంతో జాబ్ పోతుందని.. ప్రాణాలతో ఉండవని బెదిరించినట్లు లెటర్ లో రాసింది. తనకేదైనా జరిగితే అధికారులదే బాధ్యత అని కూడా లెటర్ లో రాసింది.
ఈ కేసులో సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ భద్నే గత ఐదు నెలలుగా తనపై నాలుగు సార్లు అత్యాచారం చేశాడని, ఐటీ ఉద్యోగి ప్రశాంత్ బంకర్ తనను మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నాడని తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్‌లో ఆమె పేర్కొంది. ఇదే విషయమై జూన్ 19న ఫల్తాన్ డీఎస్పీకి, తర్వాత జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
పలు పోలీసు కేసుల్లో ఇరుక్కున్న నిందితులకు ఫేక్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఓ ఎంపీ కూడా తనను ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. సూసైడ్ నోట్లోని వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై డాక్టర్ల, మెడికల్ సంఘాలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ కేసు మహారాష్ట్రలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ప్రభుత్వం దోషులను కాపాడుతోంది కాబట్టే పోలీసుల అరాచకాలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడేట్టివార్ మహాయుతి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నాయకురాలు చిత్ర వాఘ్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని, ప్రభుత్వం పూర్తి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
