సోషల్ మీడియాలో హేట్ స్పీచ్ (విద్వేష వ్యాఖ్యలు), హేట్ థాట్ (విద్వేష ఆలోచన) జాడ్యం పెరుగుతోంది. యూజర్లు తమకు నచ్చనిదైతే చాలు.. కులం, మతం, సంస్కృతి, ప్రాంతం, ఒక పార్టీ.. ఇలా ఏదైనా కానీ విద్వేషపూరిత విషపు రాతలు రాస్తున్నారు. ఇదే భావ ప్రకటన స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్టకు భంగం కలిగించేలా, దురుద్దేశాలను ఆపాదించేలా అసత్యాలను కొందరు యూజర్లు, కొన్ని గ్రూపులు రాతల్లో, వ్యాఖ్యల్లో వెళ్లగక్కుతున్నారు.
ఇలాంటివారు సోషల్ మీడియాలో కొకొల్లలు. గాంధీ, బీఆర్ అంబేద్కర్, నెహ్రూ, ఇందిర వంటి నేతలనే ఎక్కువగా టార్గెట్ చేసుకుని క్యాస్ట్, పాలిటిక్స్, హిస్టరీ ట్విస్ట్‌లపై హేట్ స్పీచ్‌లకు, హేట్ థాట్లతో దుర్భుద్ధిని చూపుతున్నారు. కొన్ని ఘటనలు హింసాత్మకంగానూ, ఆందోళనలకు దారితీసిన సందర్భాలను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ చూస్తున్నాం. ఇక సున్నితమైన విషయాలనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఫేక్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటివాటికి సోషల్ మీడియా వేదికగా మారడం దౌర్భాగ్యం!
కత్తి కంటే మాటకే పదునెక్కువ..
‘కత్తి కంటే మాటకే పదునెక్కువ’ అనే సామెత తెలిసిందే!. సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు, మీమ్స్, ఫేక్ కోట్స్, మార్ఫింగ్ ఫొటోలను పోస్టులుగా వైరల్ చేస్తున్నారు. నచ్చని వ్యక్తుల వ్యక్తిత్వాన్ని మచ్చగా చూపడానికి, సమాజం ముందు దోషిగా నిలపడానికి యత్నిస్తున్నారు. అంతేకాదు.. వారి కుటుంబాలను కూడా మానసిక క్షోభకు గురి చేసే దుర్మార్గపు బుద్ధిని చూపుతున్నారు.
మొన్నటికి మొన్న శ్రీకాంత్ అయ్యంగార్ అనే తెలుగు నటుడు ఒక వీడియోలో మహాత్మా గాంధీని ‘జాతిపిత’గా పిలవడం అవమానమని, ఆయన సిద్ధాంతాలు దేశానికి హాని చేశాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయనొక్కడే కాదు ఇలాంటివివారు వ్యూయర్షిప్ కోసమా చేస్తున్నారా? లేక కావాలనే విషం కక్కుతూ మాట్లాడుతున్నారా? అనేది వాళ్లకే వదిలేద్దాం. వీరి ప్రవర్తనా ధోరణి, వ్యవహార శైలిని చూస్తుంటే ఒక్కోసారి.. ‘మన దేశం ఎటువైపు వెళుతోంది! ఆధునిక విజ్ఞానంలోకా? అజ్ఞానంలోకా?’ అని ప్రశ్నించుకోవాల్సి వస్తుంది.
రాజ్యాంగాన్ని కూడా వదలడంలేదు
‘చరిత్రను సృష్టించవచ్చు.. చరిత్రను పునర్ నిర్మించలేం.’ అన్నారు ఓ చరిత్రకారుడు. భారతీయత అంటే.. భిన్నత్వంలో ఏకత్వం. మన రాజ్యాంగం కూడా ఇదే ఎత్తి చూపుతోంది. అదే పాలకులను ఆచరణలో చూపమంటోంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పైనా చిల్లరమాటలు మాట్లాడేవారు, వంకర బుద్ధిని చూపేవారు సోషల్ మీడియాలో ఎక్కువయ్యారు. నిన్నటికి నిన్న, ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి .. ‘రాజ్యాంగంతోనే దేశానికి నష్టం జరిగిందంటూ’ మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇంకొందరు మన రాజ్యాంగాన్ని కాపీ చేసి రాశారని, దాన్ని మార్చేయాలి అంటుంటారు.
అభివృద్ధి చెందిన దేశాలు టెక్నాలజీని అనుసరిస్తుంటే..
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు సైన్స్ , టెక్నాలజీ వైపు దూసుకెళ్తున్నాయి. అభివృద్ధి చెందుతోన్న మనదేశంలో మాత్రం దేశ నేతలపై విద్వేష రాతలు రాయడం, విషపు వ్యాఖ్యలు చేయడంలో దూసుకెళ్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు మనజాతి నిర్మాతల ఆలోచనలను, సిద్ధాంతాలను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకుని అనుసరిస్తున్నాయి. వాళ్లను నిత్యం స్మరించుకునేందుకు గుర్తుగా విగ్రహాలను నెలకొల్పుకుంటున్నాయి.
ప్రపంచ శాంతిదూతగా గాంధీని, ప్రపంచ మేధావిగా బీఆర్ అంబేద్కర్‌ను గుర్తించి కీర్తిస్తున్నాయి. అంతేకాదు ఎన్నో దేశాలు గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను తమ దేశాల్లో ఏర్పాటు చేసుకున్నాయి. వీరి సిద్ధాంతాలను, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని తమ దేశ ప్రజలకు చెప్పుకుంటున్నాయి. కానీ, మనదేశంలో... ఆ మహనీయులకు సోషల్ మీడియాలో అలాంటి గౌరవం కనిపిస్తున్నదా?
ప్రతి ఒక్కరిపైనా సామాజిక బాధ్యత
నేడు సోషల్ మీడియా సమాజానికి ఒక ఆయుధంగా మారింది. మంచికోసం వాడితే అది సమాజాన్ని ఏకం చేసేదిగా నిలుస్తుంది. అదే చెడుకోసం ఉపయోగిస్తే సమాజాన్ని విభజిస్తుంది. ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కమ్యూనిటీ స్టాండర్డ్స్‌ను పాటించక పోవడం వంటి సమస్య కూడా పెరిగిపోతోంది. విద్వేష వ్యాఖ్యలను కట్టడి చేసేందుకు మనదేశంలో సరైన చట్టాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
సుప్రీంకోర్టు కూడా సోషల్ మీడియాలో ద్వేషపూరిత రాతలు, వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. కానీ, అది దేశ ఐక్యతకు విఘాతం కాకూడదు. సోషల్ మీడియాలో విభజన ధోరణులకు అడ్డుకట్టవేయాలని కూడా స్పష్టం చేసింది. విద్వేష వ్యాఖ్యలను షేర్ చేయకుండా కొన్ని నియంత్రణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. విద్వేష ప్రసంగాలను నియంత్రించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాలని, అదేవిధంగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఉందని పేర్కొంది.
సామాజిక బాధ్యత పెరగాలి
కొన్నేండ్ల కింద లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. విద్వేష వ్యాఖ్యలను నేరంగా పరిగణించేలా ప్రత్యేక నిబంధనలను ఐపీసీలో చేర్చాలని కమిషన్ సూచనలు చేసింది. ఇండియా హేట్ ల్యాబ్ వంటి ఆర్గనైజేషన్లు నివేదికలు ఇస్తున్నాయి. జర్మనీ, కెనడా, యూకే వంటి దేశాల్లో సోషల్ మీడియాలో హేట్ స్పీచ్‌ను నేరంగా పరిగణించి నిషేధిస్తాయి. మన దేశంలో సోషల్ మీడియాలో విషపు రాతలు, విద్వేష వ్యాఖ్యలు చేసినవారిపై కేసులు నమోదవుతున్నాయి. కోర్టు తీర్పులు ఇస్తున్నాయి. అయినా భయపడడం లేదు. అలాంటి ప్రబుద్ధుల రోత రాతలను ఖండిస్తూ.. అడ్డుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది!
- వేల్పుల సురేష్,
సీనియర్ జర్నలిస్ట్
