రామాయంపేటలో కొనసాగుతున్న బంద్

 రామాయంపేటలో కొనసాగుతున్న బంద్

మెదక్ జిల్లా రామాయంపేటలో బంద్ కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల వేధింపులతో గంగం సంతోష్, అతని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నిరసన తెలుపుతున్నారు స్థానికులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రామాయంపేట బంద్ కి పిలుపునిచ్చింది బీజేపీ. స్వచ్ఛందంగా షాపులు బంద్ చేశారు వ్యాపారులు. బంద్ తో రామాయంపేటలో పోలీసులు భారీగా మోహరించారు.

మరోవైపు రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు ఇవాళ రామాయంపేటలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న గంగం సంతోష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఇతర ముఖ్య నేతలు రామాయంపేట వెళ్లనున్నారు. 

తల్లీ, కొడుకు ఆత్మహత్య కేసులో బాధితుల కుటుంబ సభ్యులను విచారించారు అధికారులు. నిన్న బాన్సువాడ డీఎస్పీ ఆధ్వర్యంలో 3 గంటలుగా పైగా కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తీసుకున్నారు. తమ వారి ఆత్మహత్యకు కారణమైన మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరిని అరెస్ట్ చేయకపోవడంపై బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఆత్మహత్య ఘటనలో తమ తప్పేం లేదని నిందితులు వీడియోలు రిలీజ్ చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరణ వాంగ్మూలం కన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.