
- నాలుగు కమిషనరేట్ల పరిధిలో తిప్పిన పోలీసులు
- కరీంనగర్ నుంచి యాదాద్రి, అక్కడి నుంచి హనుమకొండకు
- యాదాద్రిలోని బొమ్మలరామారం స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
- బీజేపీ నేతలు, కార్యకర్తల ఆందోళన.. అరెస్టు
హైదరాబాద్/యాదాద్రి, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టులో హైడ్రామా నడిచింది. మీడియా, బీజేపీ కార్యకర్తలను డైవర్ట్ చేసేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. సంజయ్ ను నాలుగు కమిషనరేట్ల పరిధిలోని ఏడు జిల్లాల్లో తిప్పారు. ఆయన ఆచూకీ ఎవరికీ తెలియకుండా ప్లాన్ చేశారు. కరీంనగర్, సిద్దిపేట, రాచకొండ, వరంగల్ కమిషనరేట్ సహా మొత్తం ఏడు జిల్లాల పోలీసులు సంజయ్ అరెస్టులో కీలకంగా వ్యవహరించారు. భారీ కాన్వాయ్‌ల మధ్య ఆయనను తరలించారు. సంజయ్ ను కరీంనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనను వరంగల్‌కు తరలిస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని భావించి రాత్రికి రాత్రే కరీంనగర్ నుంచి డైరెక్ట్‌గా యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బొమ్మలరామారంలో హైటెన్షన్..
పోలీసులు బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు సంజయ్ ను బొమ్మలరామారం స్టేషన్ కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలియడంతో యాదాద్రి, నల్గొండకు చెందిన బీజేపీ లీడర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్ కు తరలివచ్చారు. లోపలి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది కార్యకర్తలు, లీడర్లను పోలీసులు అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఇదే సమయంలో అక్కడికొచ్చిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్టేషన్ లోపలికి వెళ్లి సంజయ్‌ను కలిశారు. మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కూన శ్రీశైలం గౌడ్, బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు, స్టేట్ లీడర్ గూడూరు నారాయణరెడ్డి వేర్వేరుగా అక్కడికి చేరుకున్నారు. సంజయ్ కలిసేందుకు అనుమతించాలని కోరగా, పోలీసులు ఒప్పుకోలేదు. వాళ్లను అరెస్టు చేశారు. ఇక బొమ్మలరామారానికి కీసర మీదుగా వస్తున్న మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావును సరిహద్దుల్లోనే పోలీసులు అపేశారు. స్టేషన్ కు సమీపంలో ఎమ్మెల్యే రఘునందన్ రావును అరెస్టు చేశారు.
పక్కా ప్లాన్‌తో తరలింపు...
కోర్టులకు బుధవారం సెలవు కావడంతో జడ్జి ఇంటి వద్ద సంజయ్ ను హాజరుపరుస్తారని అందరూ భావించారు. బీజేపీ లీడర్లు కూడా అందుబాటులో ఉన్న అడ్వకేట్లను భువనగిరి, ఆలేరు కోర్టుల వద్దకు పంపించారు. సమాచారం అందుకున్న బీజేపీ కార్యకర్తలు రోడ్లపైకి చేరుకున్నారు. అయితే పోలీసులు మాత్రం పక్కా ప్లాన్‌తో భువనగిరి, ఆలేరు న్యాయమూర్తుల వద్దకు కాకుండా సంజయ్‌ను నేరుగా జనగామ వైపు తరలించారు. సంజయ్ ను భువనగిరిలోని జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు మీడియాను, కార్యకర్తలను డైవర్ట్ చేశారు. సంజయ్ కు జనగామ జిల్లా పాలకుర్తిలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి, వర్ధన్నపేట మీదుగా హనుమకొండ తరలించారు.
కారు అద్దాలకు పేపర్లు అడ్డు పెట్టి..
బొమ్మలరామారం స్టేషన్ వద్ద ఆందోళనలు జరుగుతున్న టైమ్ లో యాదాద్రి జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర అక్కడికి వచ్చారు. సంజయ్ ను ఎందుకు అరెస్టు చేశామో? కొద్దిసేపట్లో చెబుతామంటూ ప్రకటించారు. కానీ ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. వందలాది మందిని అరెస్ట్ చేసినా, వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలిరావడంతో సంజయ్ ను తరలించాలని పోలీసులు నిర్ణయించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉదయం 10:25 గంటలకు ఆయనను తీసుకెళ్లారు. బీజేపీ కార్యకర్తలకు సంజయ్ కన్పించకుండా స్టేషన్ వెనుక గేట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడున్న మూడు వాహనాల్లో ఒకదాంట్లో సంజయ్‌ను ఎక్కించారు. సంజయ్ బయటకు కనిపించకుండా కారు అద్దాలకు న్యూస్ పేపర్లు అడ్డుపెట్టారు. ఆ మూడు వాహనాలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా, వాళ్లను చెదరగొట్టి భువనగిరి వైపు వెళ్లారు.