
- కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు రెండోస్థానం కోసమే పోటీ పడుతున్నారని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు. బీజేపీ గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. అఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో మిత్రసేన యువకులు భారీ ఎత్తున బుధవారం బీజేపీలో చేరారు. అనంతరం పట్టణంలోని రాంనగర్ లో బుధవారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో గంగుల కమలాకర్ లక్ష సెల్ ఫోన్లను, ఓటుకు రూ.10 వేలను నమ్ముకున్నాడని, తాను ధర్మాన్ని, కరీంనగర్ ప్రజలను నమ్ముకున్నానని వెల్లడించారు.
''రాహుల్ గాంధీ అసలు రౌల్ విన్సీ... రాజకీయాల్లోకి వచ్చి రాహుల్ గాంధీగా పేరు మారారు. కల్వకుంట్ల అజయ్ రావు... కల్వకుంట్ల తారక రామారావుగా మారారు. ఇప్పుడు కరీంనగర్ లో గంగుల కమలాకర్ ఎంఐఎం ఓట్ల కోసం దారుస్సలాం పోయి టోపీ పెట్టుకుని కరీంనగర్ కమ్రుద్దీన్ గా మారారు'' అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల కోసం తాను రెండుసార్లు జైలుకు పోయానని గుర్తుచేశారు.
కేసీఆర్ తనపై 74 కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడని మండిపడ్డారు. తాను కరీంనగర్ అభివృద్ధికి తెచ్చిన కేంద్ర నిధులపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరితే బీఆర్ఎస్ నేతలు ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు.
పోటీ నుంచి తప్పుకుంటా..
‘‘మిస్టర్ గంగుల కమలాకర్... తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణానికి రూ.150 కోట్ల నిధులు తాను తీసుకొస్తే.. కొబ్బరికాయ కొట్టి ఫోజులిచ్చిన మోసగాడు గంగుల అని మండిపడ్డారు. నిధులను కేంద్రం నుంచి నేనే తీసుకొచ్చిన. కానీ నువ్వు కొబ్బరికాయ కొట్టి ప్రచారం చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నవ్. నేను సవాల్ చేస్తున్నా.. ఆ నిధులన్నీ నేనే తెచ్చినట్లు ఆధారాలతో సహా నిరూపిస్తా. దమ్ముంటే కేసీఆర్ ను బహిరంగ సభకు రమ్మను. నేను తప్పు చేసినట్లు రుజువు చేస్తే ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకుంటా’ అని సంజయ్ సవాల్ విసిరారు.