పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన బీజేపీ

పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన బీజేపీ

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరిచింది.  గుజరాత్ లోని సూరత్ పార్లమెంట్ స్థానం ఏకగ్రీవమైంది.  సూరత్‌ లోక్ సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.  కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్  తిరస్కరణకు గురికావడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.  సోమవారం మిగతా అభ్యర్థులందరూ కూడా తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడంతో ముకేష్ ఎన్నిక ఏకగ్రీవమైంది.   

సూరత్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న నీలేశ్‌ కుంభనీ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో  ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ నుంచి వేసిన మరో నామినేషన్‌ కూడా చెల్లనిదిగా ఆయన  ప్రకటించారు. ఇక ఇదే స్థానం నుంచి నామినేషన్లు వేసిన మరో 8 మంది కూడా ఉపసంహరించుకున్నారు.  ఇందులో  7 స్వతంత్రులతో పాటు ఒక బీఎస్పీ అభ్యర్థి  ఉన్నారు.  పోటీలో ముకేశ్‌ దలాల్‌ ఒక్కరే మిగలడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈసీ దీనిపై అధికార ప్రకటన చేయనుంది.  

ముఖేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఆయనకు  ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.  వచ్చే ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయానికి దీనితో నాంది పడిందని.. మోదీ నాయకత్వంలో గుజరాత్‌ సహా దేశవ్యాప్తంగా 400 స్థానాలతో కమలం జయభేరీ మోగిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కూటమిగా పోటీ చేస్తున్నాయి. 26 స్థానాలకు గాను కాంగ్రెస్ 24 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, ఆప్ భావ్‌నగర్, భరూచ్‌లో పోటీ చేస్తోంది. గుజరాత్‌లో మే 7న ఎన్నికలు జరగనున్నాయి.