మానవ సంబంధాలు తెలియని కేసీఆర్కు బలగం మూవీ అంకితం

 మానవ సంబంధాలు తెలియని కేసీఆర్కు బలగం మూవీ అంకితం

మానవ సంబంధాలు తెలియని కేసీఆర్ కు బలగం సినిమా అంకితమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. ఏప్రిల్ 10వ తేదీ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి ధియేటర్ లో బలగం సినిమా చూశారాయన. బండి సంజయ్ తోపాటు ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధియేటర్ లో సినిమా చూశారు.

"బలగం సినిమా అద్భుతంగా ఉంది. మా కరీంనగర్ కి చెందిన వేణు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ బాధ్యతల గురించి చక్కగా చూపించారు. మన హిందు సనాతన ధర్మాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. మనిషి బతికున్నప్పుడు, చనిపోయాక ప్రాముఖ్యతను బాగా చూపంచారు. ప్రస్తుత సమాజంలో ఒకరు చనిపోతే దాన్ని 11 రోజులు పండుగలా చేసుకుంటున్నారు.. కానీ దాని ప్రాముఖ్యత ఎవరి తెలీదు. పిట్టకి పెడుతున్నారు కానీ కాకి ముట్టిందా లేదా అని పట్టించుకోట్లేదు". 

"పేరు, పబ్లిసిటీ, కలెక్షన్స్ కోసం చూడకుండా ఒక మంచి సినిమాని తీసిన వేణుకి నా అభినందనలు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వేణు ఇప్పుడు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ సినిమా కేసీఆర్ చూడాలి. చూసి బంధాలు, వాటి విలువలు తెలుసుకోవాలి. కేసీఆర్ కి మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యం. కేసీఆర్ కుటుంబ విలువలు తెలుసుకోవాలి" అని బండి సంజయ్ పేర్కొన్నారు.