కేసీఆర్ తడిగుడ్డతో గొంతు కోసే రకం

కేసీఆర్ తడిగుడ్డతో గొంతు కోసే రకం
  • ప్రజలంతా ఏకం కావాలి
  • కేసీఆర్ పాలనను బొందపెట్టేందుకు ఇదే చివరి ఉద్యమం కావాలి
  • ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్
  • కేసీఆర్ తడిగుడ్డతో గొంతు కోసే రకం
  • పోలీసులు, గూండాలతో యాత్రను అడ్డుకోవాలని కుట్ర
  • కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొడదాం

జనగామ, వెలుగు: ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ పీఠాలు కదులుతున్నాయని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఉఫ్ మని ఊదితే కొట్టుకపోయే పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ఏ పార్టీ బలమేందో తేల్చుకుందామని, హైదరాబాద్‌‌లో బల ప్రదర్శనకు సిద్ధమా అని సీఎం కేసీఆర్‌‌‌‌కు సవాల్ విసిరారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గురువారం జనగామ జిల్లాలోని లింగాల ఘన్​పూర్ మండలం కుందారం నుంచి మొదలైన పాదయాత్ర నెల్లుట్ల, జనగామ టౌన్ మీదుగా చిటకోడూరు రోడ్డు దాకా 15 కిలోమీటర్ల మేర కొనసాగింది. జనగామ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు. ‘బీజేపీ ఏడుంది’ అనే కేసీఆర్‌‌‌‌కు సంగ్రామ యాత్రకు వస్తున్న జనాన్ని చూసి జండూబామ్​ రాసుకోవాల్సి వస్తున్నదన్నారు. కేసీఆర్ తడిగుడ్డతో గొంతు కోసే రకమని, పోలీసులను, గూండాలను అడ్డుపెట్టుకుని ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలనే కుట్రకు తెరలేపారని విమర్శించారు. కేసీఆర్ పాలనను బొంద పెట్టేందుకు ఇదే చివరి ఉద్యమం కావాలని, అందుకోసం ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. 

ప్రజల కోసం గూండాలుగా మారుతం

టీఆర్ఎస్ గూండాల పీడ విరగడ చేసేందుకు.. వారి నుంచి జనాన్ని రక్షించుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రజల కోసం పనిచేసే గూండాలుగా మారడానికి సిద్ధమని బండి సంజయ్ అన్నారు. అధికారం ఉందని పోలీసులను అడ్డం పెట్టుకుని దాదాగిరీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రతి బీజేపీ కార్యకర్త, ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్‌‌లా తిరగబడతారన్నారు. ‘‘ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేసినోళ్ల ఏరియాకు నేనే పోత.. గల్లీ గల్లీ తిరిగి ఎన్నికల్లో వాళ్లకు డిపాజిట్ రాకుండా చేస్తా. 12 శాతం ముస్లిం ఓట్లు ఉన్న బీహార్‌‌‌‌లో ఎంఐఎం ఐదు సీట్లు గెలిచింది. 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంకుగా మారితే తెలంగాణలో కాషాయ జెండా ఎగిరేయలేమా” అని అన్నారు. సామూహిక జాతీయ గీతాలాపన సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న ఒవైసీ స్వతంత్ర భారత్ కీ జై అనలేదని.. అలాంటి వాళ్లతో ఉండే కేసీఆర్ నిజమైన భారతీయుడు కాలేడన్నారు. కేసీఆర్ గడీలో బందీ అయిన తెలంగాణ తల్లి.. తనకు విముక్తి కల్పించాలని ఏడుస్తున్నదని సంజయ్ అన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొడదామని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు కామర్సు బాలసుబ్రమణ్యం, ఆరుట్ల దశమంత్​ రెడ్డి, పాపారావు, కేవీఎల్​ఎన్​ రెడ్డి, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ముక్కెర తిరుపతి రెడ్డి, సౌడ రమేశ్‌‌ తదితరులు పాల్గొన్నారు.

గులాబీ లీడర్లకు నయీంకు పట్టిన గతే

నయీంకు పట్టిన గతే జనగామ, పాలకుర్తి గులాబీ లీడర్లకు పడుతుందని సంజయ్ హెచ్చరించారు. జనగామకు ఐటీఐ, పీజీ కాలేజీలు ఇస్తామని హామీ ఇచ్చారని, అవి ఏమయ్యాయని ప్రశ్నించారు. ‘‘మిషన్ భగీరథ అన్నరు.. ఇప్పుడు జనగామకు కనీసం తాగే నీళ్లు కూడా లేని పరిస్థితి. పెంబర్తి నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నరు. ఏదీ అమలు కాలే. జనగామ అర్బన్ డెవలప్‌‌మెంట్ అథారిటీ అని ట్విట్టర్ టిల్లు కేటీఆర్ చెప్పిండు. కానీ చెయ్యలే. ఇంకెప్పుడు చేస్తారు?” అని ఫైర్ అయ్యారు. ‘‘జనగామలో కనీస సౌకర్యాలు కల్పించలేని మూర్ఖుడు ఇవాళ బీజేపీ సమాధానం చెప్పాలంటడా? ఎన్నికలు రానీ.. పక్కా సమాధానం చెప్తం’’ అని అన్నారు.