
- ఎమర్జెన్సీలో ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి: ఎన్.రాంచందర్రావు
- వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని క్యాడర్‌కు పిలుపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాగులు, చెరువుల దగ్గరికి వెళ్లొద్దని కోరారు. పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం హైదరాబాద్లోమీడియాతో ఆయన మాట్లాడుతూ.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందని గుర్తుచేశారు.
వర్షాల కారణంగా రోడ్లు మునిగిపోవడం, ట్రాఫిక్, మురుగునీరు ఉప్పొంగడం, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వ హెల్ప్‌లైన్ లేదా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహారం, తాగు నీరు సరఫరా, వైద్య సహాయం, వృద్ధులు, చిన్నపిల్లలకు సహకరించడం వంటి కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించడం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు.
విద్యార్థులు తమ ఇంటిపై జెండా ఎగరేయాలి
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నాచారం ఢిల్లీ పబ్లిక్స్కూల్లో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ... కులమతాలకు అతీతంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్యోద్యమం గురించి తెలుసుకోవాలన్నారు. అమరుల త్యాగాలతోనే స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తుచేశారు.
ఆపరేషన్ సింధూర్ లో స్వదేశీ ఆయుధాలను ఉపయోగించి యుద్దం చేశామని, దీంతో ప్రపంచానికి భారత్‌శక్తి తెలిసిందన్నారు. గురువారం నగరంలోని నెక్లెస్ రోడ్లో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని, ప్రజలంతా పాల్గొనాలని కోరారు. టీచర్ ఎమ్మెల్సీ, డీపీఎస్ చైర్మన్ మల్క కొమరయ్య మాట్లాడుతూ.. దేశానికి విద్యార్థులే భావి భారత పౌరులని, దేశసేవలో విద్యార్థులు ముందుండాలని సూచించారు. దేశ విభజన సమయంలో జరిగిన పరిణామాలను సైతం విద్యార్థులు తెలుసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ తదితరులు పాల్గొన్నారు.
అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలి..
న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాంచందర్ రావు స్వాగతించారు. అలాగే, న్యాయవాదుల భద్రత కోసం వెంటనే ‘అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్’ను తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈ చట్టం కోసం అనేకసార్లు డిమాండ్ చేశానని గుర్తుచేశారు.