
- ఢిల్లీ పెద్దలు నా ఆవేదన పట్టించుకోలే: రాజాసింగ్
- దేశ ద్రోహులు, ధర్మ ద్రోహులపై పోరాడుతానని వెల్లడి
హైదరాబాద్/ న్యూఢిల్లీ, వెలుగు: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆ పార్టీ హైకమాండ్ ఆమోదించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఈ మేరకు ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్‌సింగ్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.‘‘రాజీనామా లేఖలో పేర్కొన్న విషయాలు అసంబద్ధంగా ఉన్నాయి. రాజాసింగ్ కార్యకలాపాలు, పనితీరు పార్టీ సిద్ధాంతాలు, సూత్రాలకు విరుద్ధంగా ఉంటున్నాయి’’ అని అందులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తున్నామని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసేందుకు వస్తే తనకు మద్దతిచ్చే వారిని బెదిరించి, తనను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్గత నెల 30న బీజేపీకి రాజీనామా చేశారు. అప్పటి స్టేట్ ప్రెసిడెంట్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆ లేఖను నేషనల్ కమిటీకి పంపించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు.
హిందుత్వవాదులకు అండగా ఉంట: రాజాసింగ్
బీజేపీలోని హిందుత్వవాదులు, కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని, ఆవేదన చెందొద్దని, అందరికీ తాను అండగా ఉంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు. తన రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించినట్టు తెలియగానే మీడియాకు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటు చేయాలనే కలతో రాత్రి, పగలు పనిచేస్తున్న లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల గొంతుకను ఢిల్లీకి తీసుకుపోవాలని అనుకున్నా.. కానీ అందులో నేను ఫెయిల్అయ్యాను.
నేను రాజీనామా ఎందుకు చేశానో, రాజీనామా వెనుక కారణం ఏముందో జాతీయ నాయకులు పరిశీలించలేదు’’ అని పేర్కొన్నారు.‘‘సరిగ్గా 11 ఏండ్ల క్రితం నేను బీజేపీలో చేరా. నాపై విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గోషామహల్ నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు. బీజేపీ టికెట్‌పై 3 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందా. దేశం , హిందూ సమాజం, గోమాత కోసం, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా పోరాడా. ఏ పదవులు లేనప్పుడే దేశద్రోహులపై పోరాటం చేశా, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా పోరాటం కొనసాగిస్తున్నా. ఇకముందు కూడా దేశద్రోహులు, ధర్మ ద్రోహులపై ఫైట్ చేస్తా’’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.
కాగా, తాను బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్‌లో చేరుతానని కొన్ని మీడియా చానళ్లలో వార్తలు వస్తున్నాయని, కానీ ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. తన అనుచరులతో మాట్లాడిన తర్వాతే ఏమి చేయాలో నిర్ణయిస్తానని వెల్లడించారు. మీడియాలో ఎలాంటి తప్పుడు వార్తలను ప్రసారం చేయొద్దని జర్నలిస్టులకు విజ్ఞప్తిచేశారు.