
పుల్కల్, వెలుగు : ‘పదేండ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రజల సొమ్ము దోచుకుంటే.. అచరణ సాధ్యం కాని హామీలిచ్చిన కాంగ్రెస్ మోసం చేస్తోంది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. మాజీ ఎంపీ బీబీపాటిల్ ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో రాంచందర్‌రావు మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ. 12 లక్షల కోట్లను ఖర్చు చేసిందని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
అంతకుముందు జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావ్ కులకర్ణి, నాయకులు జనవాడ సంగప్ప, పల్వట్ల జగదీశ్వర్, దేశ్‌పాండే, ప్రభాకర్, ముత్తిరెడ్డి, ప్రవీణ్, రాజ్‌కుమార్, ప్రభుగౌడ్, పాండు పాల్గొన్నారు.