సోషల్‌‌ మీడియాలో ఇష్టమున్నట్టు మాట్లాడొద్దు: రామచందర్ రావు

సోషల్‌‌ మీడియాలో  ఇష్టమున్నట్టు మాట్లాడొద్దు: రామచందర్ రావు
  • పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు: రాంచందర్‌‌‌‌రావు
  • నేతలెవరూ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ నిర్ణయాలుగా చెప్పొద్దు 
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి
  • బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ ఆవిర్భావ వేడుకలు 

హైదరాబాద్, వెలుగు: పార్టీ కన్నా ఎవరూ ఎక్కువ కాదని, నేతలు తమ వ్యక్తిగత అజెండాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. తాను కూడా ఓ కార్యకర్తనేనని, పార్టీ తర్వాతే ఎవరైనా అని వెల్లడించారు. నాయకులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ నిర్ణయాలుగా చెప్పకూడదని అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు పార్టీ నియమ నిబంధనలు పాటించాలని, పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లోని స్టేట్ ఆఫీసులో బీజేపీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. పార్టీ జెండాను రాంచందర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 లక్షల సభ్యత్వంతో బీజేపీ బలంగా ఉందని, రాబోయేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కై బీజేపీని ఎదగకుండా చేస్తున్నాయని అన్నారు. వీటిని తిప్పికొట్టేందుకు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కదలాలని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దృఢమైన, స్వయం సమృద్ధమైన వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

నిస్వార్థంగా పనిచేయాలి: బండారు దత్తాత్రేయ

 ప్రతి కార్యకర్త నిస్వార్థంగా పనిచేయాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరాలని,  వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రానికి బీజేపీ అభ్యర్థే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఆ దిశగా నేతలు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ.. సిద్ధాంతాలతో నడిచే పార్టీ  అని  ఆ పార్టీ  జాతీయ నాయకుడు మురళీధర్ అన్నారు. గతంలో నక్సలైట్లను దేశభక్తులు అని కాంగ్రెస్ అభివర్ణించిందని, కానీ వారు దేశద్రోహులని, దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని చూపించిన పార్టీ బీజేపీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ,ఇతర నేతలు పాల్గొన్నారు.