
- కాళేశ్వరం ఎంక్వైరీలో రాజకీయ నేతలనూ విచారించాలి
- మీడియా చిట్ చాట్లో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘ఫోబియా’ పట్టుకుందని, అందుకే ఏ విషయానికైనా కిషన్ రెడ్డినే బాధ్యుడ్ని చేస్తూ సీఎం మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. సీఎం రేవంత్ తీరు రాష్ట్రానికి మంచిది కాదని పేర్కొన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కేంద్రానికి ఏం సంబంధం అని.. వాటిని రాష్ట్ర సర్కారు అమలు చేయాలని అన్నారు.
శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాంచందర్రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘సీఎం ఇప్పటికే 50 సార్లకుపైగా ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలను సెలబ్రేట్ చేసుకోవాలి” అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో పాలన దారుణంగా ఉందని, అడ్మినిస్ట్రేషన్‌లో కీలకంగా ఉండే బ్యూరోక్రాట్ల నియామకంలో రేవంత్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. గతంలోని బీఆర్ఎస్ సర్కారు గ్రూప్1 పరీక్షను సక్రమంగా నిర్వహించలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ అదే దారిలో ఉందని అన్నారు.
‘‘రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేక ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నది. కానీ, ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పటికీ ఓయూ హాస్టళ్లు గుర్రాల షెల్టర్లలో కొనసాగుతున్నాయి” అని తెలిపారు.
నా తండ్రి మూడేండ్ల కింద చనిపోయినా మొన్నటి దాకా ఓటర్ లిస్టులో పేరుండె
దేశానికి సంబంధించిన అంతర్జాతీయ అంశాలు వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కటి కావాలని, కానీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నదని రాంచందర్రావు అన్నారు. పలు రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ 'ఓట్ చోరీ' అని ఆరోపిస్తున్నారని, అది ఎలా జరిగిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోనూ బోగస్ ఓట్లున్నాయని, గత ఎన్నికల్లో బోగస్ ఓట్ల నమోదు వెనుక కాంగ్రెస్, ఎంఐఎం ఉన్నాయని ఆరోపించారు.
తన తండ్రి చనిపోయి మూడేండ్లవుతున్నా ఆయన పేరు మొన్నటి వరకు ఓటర్ జాబితాలో ఉండేదని.. తీసేయడానికి దరఖాస్తు పెట్టుకున్నట్లు రాంచందర్రావు తెలిపారు. సెప్టెంబర్ 17న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటనలో ఈటల రాజేందర్, పార్టీకి మధ్య ఎలాంటి వివాదం జరగలేదని అన్నారు. తెలంగాణలో రాజకీయ 'వాక్యూమ్' ఉందని, దాన్ని భర్తీ చేసి ప్రత్యామ్నాయ శక్తిగా తాము ఎదుగుతామని చెప్పారు. ఇప్పుడిప్పుడే పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.
సీబీఐ విచారణతో వాస్తవాలు బయటికి
కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి సీబీఐ విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేసిందని, ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రాంచందర్రావు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణలోపాలతో పాటు కాంట్రాక్టర్లు, రాజకీయ నేతలపై కూడా విచారణ జరగాలన్నారు. సీబీఐ విచారణపై నమ్మకం ఉందని, వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. నక్సల్స్ వెనుక విదేశీయుల హస్తం ఉన్నట్లు తాము భావిస్తున్నామని, అందుకే వారిని లొంగిపోవాలని గడువు విధించామని తెలిపారు.
లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ ఆలస్యం చేస్తున్నదని, దానివల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయని రాంచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ కావాలనే ఎన్నికలను ఆలస్యం చేస్తున్నదని దుయ్యబట్టారు. జూబ్లిహిల్స్ అభ్యర్థి ఎంపికపై త్వరలోనే కమిటీ నియమిస్తామని, ఇప్పటికే కొందరు టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని ఆయన చెప్పారు.