హైదరాబాద్, వెలుగు: మున్సిపాలిటీల్లో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాల్లో అన్నీ తప్పులే ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. మున్సిపాలిటీల పరిధిలో లేని గ్రామాల ఓటర్లనూ ముసాయిదా జాబితాల్లో చేర్చారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాల కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధులు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినిని కలిశారు.
మున్సిపాలిటీల ముసాయిదా ఓటర్ల జాబితాల రూపకల్పనలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదల చేశారు. అయితే ఆ జాబితాల్లో చాలా తప్పులు ఉన్నాయి. డ్రాఫ్ట్ లిస్టుల్లో జరిగిన తప్పులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని కోరారు. ముసాయిదా జాబితాలను సవరించి, మళ్లీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
