టీఆర్ఎస్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

టీఆర్ఎస్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అధికార ప్రతినిధి  సంబిత్ పాత్ర సీఈసీ దృష్టికి తెచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో నకిలీ ఓట్లను తొలగించాలని ఎన్నికల కమిషన్ ను కోరారు. ఇప్పటికి 12 వేల నకిలీ ఓట్లను తొలగించారని.. మరో 14 వేల నకిలీ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని కూడా తొలగించాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు.

మునుగోడు ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వాహనాలను సైతం ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. తమ ఫిర్యాదు స్వీకరించి టీఆర్ఎస్ పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.