బీజేపీ, కాంగ్రెస్ లలో ‘లోకల్’ హీట్.. జెడ్పీటీసీ స్థానాలపై మొదలైన కసరత్తు

బీజేపీ, కాంగ్రెస్ లలో ‘లోకల్’ హీట్..  జెడ్పీటీసీ స్థానాలపై మొదలైన కసరత్తు
  • 6న పీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం
  • ఒక్కో మండలానికి ముగ్గురుచొప్పున ఎంపిక
  • ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకే!
  • కరీంనగర్ లో బీజేపీ స్టేట్ చీఫ్ ప్రెస్ మీట్
  • ముందుగా జెడ్పీటీసీ అభ్యర్థును ఎంపిక చేస్తామని ప్రకటన
  • అన్ని స్థానాలకూ పోటీ చేస్తామని వెల్లడి

హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీల్లో స్థానిక ఎన్నికల హీట్ మొదలైంది. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై రెండు ప్రధాన  పార్టీలు దృష్టి సారించాయి. కాంగ్రెస్ ఇందుకోసం ఈ  నెల 6న రాష్ట్ర రాజధానిలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ రోజు ఒక్కో మండలానికి ముగ్గురు చొప్పున జెడ్పీటీసీ అభ్యర్థులను స్క్రీనింగ్ చేయనుంది. ఇదే క్రమంలో ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికను జిల్లా నాయకత్వానికే  అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇదే అంశంపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. పార్టీకి విధేయంగా ఉండటంతో పాటు గెలిచే అవకాశం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను జిల్లా కాంగ్రెస్ కమిటీలకే అప్పగించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజైనప్పటికీ అంశం ఇంకా హైకోర్టు పరిధిలో ఉన్నందున ప్రతిపక్ష పార్టీలు చేసే కుట్రలను తిప్పి కొట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.  

బీజేపీ సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించింది. జెడ్పీటీసీ స్థానాలకు మొదటగా అభ్యర్థులను  ప్రకటించాలని నిర్ణయించింది. ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నచోట ముందుగా బీఫారాలు ఇవ్వాలని ఆ పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఆదేశించారు. వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాలకూ అభ్యర్థులను బరిలోకి దింపుతామని వివరించారు.