బీసీ బిల్లును ఆమోదించకుండా బీజేపీ కుట్రలు: మంత్రి కొండా సురేఖ

బీసీ బిల్లును ఆమోదించకుండా బీజేపీ కుట్రలు: మంత్రి కొండా సురేఖ
  • ఆ పార్టీకి బీ టీమ్​గా బీఆర్ఎస్: మంత్రి కొండా సురేఖ
  • బీసీ రిజర్వేషన్ల పేటెంట్ హక్కు కాంగ్రెస్‌‌‌‌కే ఉందని కామెంట్

పద్మారావునగర్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకుండా బీజేపీ కుట్రలు పన్నిందని, ఆ పార్టీకి బీ టీమ్​గా బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నదని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్​ రేతిఫైల్‌‌‌‌ బస్టాండ్‌‌‌‌ వద్ద కాంగ్రెస్‌‌‌‌ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్​లో మంత్రి కొండా సురేఖ పాల్గొని బీసీ సంఘాలకు సంపూర్ణ మద్దతు తెలిపారు. బంద్​కు స్థానిక వ్యాపారవేత్తలు, దుకాణదారులు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్‌‌‌‌ పార్టీ చేసిన కృషిని వివరించారు. బీసీల హక్కుల కోసం కాంగ్రెస్‌‌‌‌ పార్టీ రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తోందన్నారు. 

అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై తీర్మానం ఆమోదించి, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో బలమైన వాదనలు వినిపించామని తెలిపారు. ఢిల్లీలో జంతర్‌‌‌‌మంతర్‌‌‌‌ వద్ద ధర్నా నిర్వహించి జాతీయ స్థాయిలో బీసీ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిందన్నారు. బీజేపీ తలచుకుంటే ఐదు నిమిషాల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వగలదని, కానీ రాజకీయ లాభాల కోసం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచింది కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అని మంత్రి సురేఖ తెలిపారు. 

బీసీల పట్ల కాంగ్రెస్‌‌‌‌ చిత్తశుద్ధిని ఎవరూ సందేహించలేరని అన్నారు. కేంద్రంలో బీజేపీ పాలన కొనసాగుతున్నంతకాలం బీసీలకు న్యాయం జరగదని ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అన్నారు. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్‌‌‌‌ గాంధీ నాయకత్వంలో బీసీ బిల్లును పార్లమెంటులో ఆమోదించి ప్రతి వర్గానికి తగిన రిజర్వేషన్లు కల్పిస్తామని ఇద్దరు నేతలు హామీ ఇచ్చారు. కాగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌‌‌‌ నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతంగా ముగిసింది.