టీఆర్ఎస్ ఎన్ని డబ్బులు పంచినా మమ్మల్నే గెలిపిస్తరు

టీఆర్ఎస్ ఎన్ని డబ్బులు పంచినా మమ్మల్నే గెలిపిస్తరు

కరీంనగర్: కేంద్ర కేబినెట్‌లోకి కిషన్ రెడ్డిని మంత్రిగా తీసుకోవడంపై బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హర్షం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి మంత్రి కావడం వల్ల రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయని వివేక్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్ ఎన్ని డబ్బులు పంచినా.. ప్రజలు బీజేపీకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా టైమ్‌లో ఈటల రాజేందర్ చాలా కష్టపడ్డారని, ప్రజలకు అండగా ఉన్న ఆయన విక్టరీ ఖాయమన్నారు. 

ఈ ఎన్నికలు సెమీ ఫైనల్స్

‘హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది. సొంత ఆస్తులు పెంచుకోవడం పైనే కేసీఆర్ ద‌ృష్టి పెట్టారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు.. నిజాం సర్కారు పాలనను తలపిస్తోంది. సిరిసిల్లలోనూ ఇదే పరిస్థితి. అందరినీ కలుపుకుపోవాలి. అప్పుడే ప్రజల సమస్యలేంటో తెలుస్తుంది. హుజూరాబాద్‌‌లో ఈటల గెలుపు ఖాయం. చాలా సర్వేలు చేసినా టీఆర్ఎస్‌కు బలమైన అభ్యర్థి దొరకట్లేదు. కరోనా టైమ్‌‌లోనూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈటల చాలా కష్టపడ్డారు. కానీ ఇక్కడ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. భూ కబ్జా, ఇసుక మాఫియా చేస్తున్న టీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు జరపాలి. దళితుల స్కీమ్ పేరిట కేసీఆర్ మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నడు. 45 వేల ఎస్సీ ఓట్లు ఉన్నాయని స్కీమ్ పెట్టారు. ఆయనకు సడెన్‌‌గా కృష్ణా వాటర్ గుర్తుకొచ్చింది. ఈ సమస్య గురించి ఏడాది నుంచి చెబుతున్నాం. దీని మీద కమిషన్లు వేస్తే చాలని చెబుతున్నాం. కానీ ఫామ్ హౌస్‌‌లో ఉండి డ్రామా ఆడుతున్నడు. ఈ ఎన్నికలు సెమీ ఫైనల్స్. టీఆర్ఎస్ ఎన్ని డబ్బులు ఇచ్చినా సీఎంను ఓడించి ప్రజలు ధర్మం వైపు ఉంటారని ఆశిస్తున్నాం’ అని వివేక్ పేర్కొన్నారు.