కార్నర్ మీటింగ్స్పై బీజేపీ వర్క్షాప్ 

కార్నర్ మీటింగ్స్పై బీజేపీ వర్క్షాప్ 
  • హాజరైన బన్సల్, బండి, వివేక్ వెంకటస్వామి
  • కార్నర్ మీటింగ్ ప్రసంగాలపై 800 నేతలకు ట్రైనింగ్

రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. మిషన్ 90 లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యేందుకు కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 15 రోజుల్లో 11 వేల కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలని నిర్ణయించిన బీజేపీ నాయకత్వం దానికి సంబంధించి శిక్షణా తరగతులు ప్రారంభించింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన మన్నెగూడలోని వేద కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న వర్క్ షాప్కు బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్, పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సహా పలువురు నేతలు హాజరయ్యారు. కార్నర్ మీటింగులను ఎలా నిర్వహించాలి. ఎలా సమన్వయం చేసుకోవాలి, ఏ అంశాలపై చర్చించాలన్న  దానిపై బండి సంజయ్ దిశానిర్దేశం చేయనున్నారు. దాదాపు 800 మంది నేతలకు ఈ వర్క్ షాప్లో శిక్షణ ఇవ్వనున్నారు. 

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ ఈ నెల 10 నుంచి 25 వ తేదీ మధ్య 11వేల కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. కనీసం 200 మంది హాజరయ్యేలా ఈ సభలు ఏర్పాటు చేయనున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమం కోసం చేపట్టే చర్యలతో పాటు కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై  పాంప్లెట్లు పంపిణీ చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.