వాళ్లు బీజేపీకి అవసరం లేదు: ఎంపీ అర్వింద్‌‌

వాళ్లు బీజేపీకి అవసరం లేదు: ఎంపీ అర్వింద్‌‌

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, చండూరు, వెలుగు: ఫామ్​హౌస్​ హైడ్రామా నడిపిన నలుగురు ఎమ్మెల్యేలు సెకండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలని, వాళ్లు తమకు అవసరం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఏసీబీ కోర్టు జడ్జి రిమాండ్‌‌ను రిజెక్ట్ చేసినప్పుడే.. ఇదంతా కేసీఆర్ డ్రామా అని ప్రజలకు అర్థమైందని చెప్పారు. శుక్రవారం మునుగోడు బీజేపీ క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి స్వామి మధ్య జరిగిన కాల్ రికార్డింగ్‌‌గా సోషల్ మీడియాలో వైరల్‌‌ అవుతున్న ఆడియో వల్ల బీజేపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఆ ఆడియోలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని కొన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. గెలుస్తాననే ధీమా ఉంటే ఈ చిల్లర దందాలు అవసరం లేదని, ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి డ్రామాలకు తెర తీశారని విమర్శించారు. ఇది ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ ఆడిన డ్రామా అని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వీడియో, ఆడియో రెండూ ఫెయిలయ్యాయన్నారు. ప్రతి ఎన్నికలో ఇలాంటి స్టంట్లు వేసి కేసీఆర్ ఆత్మహత్య చేసుకుంటున్నారని విమర్శించారు. హుజూరాబాద్‌‌లో ఈటలను  పార్టీ నుంచి గెంటేసి ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. 

ప్రభుత్వ పథకాలు అందినయా?

‘డబుల్‌ బెడ్రూం ఇండ్లు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం వంటి స్కీంలు అందితే టీఆర్‌ఎస్‌కు ఓటేయండి, లేదంటే బీజేపీకి వేయండి’ అని అర్వింద్‌ ఓటర్లను కోరారు.  గట్టుప్పల్‌ మండలం తేరట్‌పల్లిలో ఆయన ఎమ్మెల్యే ఈటల రాజేందర్​తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.