గ్రేటర్ హైదరాబాద్ లో సీట్లపై బీజేపీ కసరత్తు

గ్రేటర్ హైదరాబాద్ లో సీట్లపై బీజేపీ కసరత్తు
  • ప్రకాశ్ జవదేకర్ ఇంట్లో నేతల సమావేశం

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలకు గ్రేటర్ పరిధిలోని కొన్ని సీట్లు కీలకంగా మారాయి. ముఖ్యంగా ముషీరాబాద్, అంబర్ పేట్ లాంటి కీలక నియోజవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం కమలం నేతలకు కత్తి మీద సాములా మారింది. సాధ్యమైనంత త్వరగా వాటిపై నిర్ణయం తీసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూర్యాపేట టూర్​ ముగించుకొని ఢిల్లీ వెళ్లిన అనంతరం.. పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్ ప్రకాశ్ జవదేకర్ ఇంట్లో పార్టీ స్టేట్​చీఫ్ కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు సిటీకి చెందిన కొందరు నేతలు పాల్గొన్నారు. ముషీరాబాద్ నుంచి లక్ష్మణ్, అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి పోటీ చేయట్లేదు..

దీంతో ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీ మూడో జాబితాను నవంబర్ 2 న ప్రకటించే చాన్స్ ఉంది. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 48 స్థానాల్లో కార్పొరేటర్లను గెలుచుకోవడంతో గ్రేటర్​హైదరాబాద్ పరిధిలో స్థానాల్లో పార్టీకి సానుకూల వాతావరణం ఉందని హైకమాండ్ గుర్తించింది. ఈ నెల 10న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ రాష్ట్ర నేతలతో భేటీ అయిన సందర్భంలో కూడా గ్రేటర్ సీట్లపై ప్రత్యేకంగా చర్చించారు. శనివారం గ్రేటర్ హైదరాబాద్​పరిధిలోని సీట్లలో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు పార్టీ స్టేట్ ఆఫీసులో మరోసారి సమావేశం కావాలని నేతలు నిర్ణయానికి వచ్చారు.