
లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటడంతో తెలంగాణపై బీజేపీ మరింత దృష్టి సారించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకున్న ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో ప్రధాని మోడీ, పార్టీ చీఫ్, కేంద్ర నాయకత్వం పెద్దగా ప్రచారం చేయలేదు. పార్టీ అధినేత అమిత్ షా.. వస్తానని చెప్పి సభలు, రోడ్‌షోలను వాయిదా వేసుకున్నారు. అయినా నాలుగు కీలక సీట్లను 50 వేలకు తక్కువ కాకుండా మెజార్టీతో గెలిచారు. భారీ మెజార్టీతో గెల్చుకోవడంతో పార్టీలో నయా జోష్ కన్పిస్తోంది.
అర్బన్ సెగ్మెంట్లతోపాటు రూరల్ సెగ్మెంట్లలోనూ జనం బీజేపీకి పట్టం కట్టారు. తెలంగాణ పాగా వేయాలని బీజేపీ ఎప్పట్నుంచో భావిస్తోంది. కానీ రకరకాల కారణాలతో తన ప్రయత్నాలను వాయిదా వేస్తూ వస్తోంది. తాజా ఫలితాలతో ఇక దూకుడు పెంచాలని నిర్ణయించుకుంది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు కార్యాచరణ మొదలు పెట్టేందుకు రెడీ అయింది.
లష్కర్‌ను నిలబెట్టుకుంది
సికింద్రాబాద్‌లో బీజేపీ తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ క్యాండిడేట్ కిషన్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. సికింద్రాబాద్ లోక్‌సభ సీటు గెలిచి సత్తా చాటారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్‌పై 62,114 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సెగ్మెంట్‌లో గెలిచిన దత్తాత్రేయకు రెండుసార్లు కేంద్రమంత్రి పదవి దక్కింది. ఇప్పుడు కిషన్‌రెడ్డికి కూడా కేబినెట్ బెర్తు ఖాయమని తెలుస్తోంది.
నిజామాబాద్‌లో సంచలనం
నిజామాబాద్‌లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ , సీఎం కూతురు కవితపై బీజేపీ క్యాండిడేట్ ధర్మపురి అర్వింద్ 71,057 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ పసుపు, ఎర్రజొన్న రైతులు కలిపి మొత్తం 185 మంది బరిలోకి దిగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీనియర్ నేత డి.శ్రీనివాస్ తన కుమారుడు అర్వింద్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
కరీంనగర్‌లో కాషాయం
కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ బి. వినోద్ కుమార్‌పై బీజేపీ క్యాండిడేట్ బండి సంజయ్ 89 వేలపైగా ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో కరీంనగర్‌లో అమిత్ షా పర్యటన ఉంటుందని ప్రకటించినా తీరా వాయిదా వేసుకున్నారు. ఇక్కడ పెద్ద నేతలు పెద్దగా ప్రచారానికి రాకపోయినా సంజయ్ గెలవడం గమనార్హం.
ఆదిలాబాద్‌లో జయకేతనం
ఆదిలాబాద్‌లో బీజేపీ క్యాండిడేట్ బాపూరావు టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ జి.నగేష్‌పై 58,493 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. చివరి నిమిషంలో పార్టీలో చేరిన ఆదివాసీ తుడుం దెబ్బ నేత బాబురావుకు టికెట్ ఇచ్చి బీజేపీ బరిలోకి దింపింది. వ్యక్తిగత ఇమేజీ, సెగ్మెంట్‌లో సామాజిక సమీకరణలు ఆయన విజయానికి దోహదం చేశాయి.
1999 తర్వాత మళ్లా ఇప్పుడు
1999లో వాజ్‌పేయి హవా ఉన్న టైంలో సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్‌లో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో గెల్చిన దత్తాత్రేయ, ఆలె నరేంద్ర, విద్యాసాగర్‌రావుకు కేంద్రంలో మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు కూడా పార్టీ మళ్లీ నాలుగు సీట్లను గెలుచుకుంది.