9న పార్టీ నేతలతో బన్సల్, తరుణ్ చుగ్, సంజయ్‌‌ రివ్యూ మీటింగ్‌‌

9న పార్టీ నేతలతో బన్సల్, తరుణ్ చుగ్, సంజయ్‌‌ రివ్యూ మీటింగ్‌‌

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ప్రచారంపై బీజేపీ ఫోకస్‌‌ పెట్టింది. ఈ నెల 9 నుంచి నియోజకవర్గంలోని గ్రామ స్థాయిలో ప్రచారాన్ని స్పీడప్ చేయడంపై దృష్టి సారించింది. దీంతో రాష్ట్ర వ్యవహరాల సంస్థాగత ఇన్‌‌చార్జ్‌‌ సునీల్ బన్సల్, రాజకీయ వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌‌ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌లు శనివారం మునుగోడులో స్టీరింగ్ కమిటీ, మండల ఇన్‌‌చార్జ్‌‌లు, సహ ఇన్‌‌చార్జ్‌‌లు, ఆ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.

డోర్ టు డోర్ ప్రచారం, బూత్ స్థాయిలో ఓటర్లను కలవడం వంటి ప్రోగ్రామ్‌‌లపై చర్చించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను, ఇతర రాష్ట్రాల బీజేపీ సీఎంలతో ప్రచారం చేయించనున్నారు. 6 మండలాలు, 2 మున్సిపాలిటీల పరిధిలో 289 పోలింగ్ బూత్‌‌లలో ప్రచారంపై ప్లాన్ చేస్తున్నారు. అలాగే, ఈ నెల 9న హైదరాబాద్‌‌లో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ బీజేపీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.