న్యూఢిల్లీ, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘నరేగా బచావో సంగ్రామ్’ సమన్వయ కమిటీలో కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి సీతక్కకు కీలక బాధ్యతలు అప్పగించింది. ‘నరేగా బచావో సంగ్రామ్’ నిరసన కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు హైకమాండ్ 9 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆమోదం మేరకు ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడిం చారు. రాజ్యసభ సభ్యుడు అజయ్ మాకెన్ కన్వీనర్‌గా మంత్రి సీతక్కతో పాటు మరో 8 మంది సభ్యుల కమిటీని ప్రకటించారు. ఇందులో జైరాం రమేశ్, సందీప్ దీక్షిత్, ఉదిత్ రాజ్, ప్రియాంక్ ఖర్గే, దీపికా పాండే సింగ్, సునీల్ పన్వార్, మణీశ్ శర్మ ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన అన్ని ఫ్రంట్ల ఆర్గనైజేషన్ల అధ్యక్షులు, ఏఐసీసీ ఓబీసీ, ఎస్సీ, మైనారిటీ, ఆదివాసీ కాంగ్రెస్ విభాగాల చైర్ పర్సన్లు, కిసాన్ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు
