పాదయాత్రపై బీజేపీ ఫోకస్‌‌‌‌

పాదయాత్రపై బీజేపీ ఫోకస్‌‌‌‌
  • సక్సెస్ చేసేందుకు 23 కమిటీలు ఏర్పాటు
  • తొలి విడతలో ఆరు.. రెండో విడతలో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో టూర్
  • జాతీయ నేతలతో యాత్ర ప్రారంభానికి సన్నాహాలు
  • అవసరమైతే ఏడాదిపాటు యాత్ర కొనసాగించడానికి కసరత్తు
  • పార్టీ లీడర్లతో రోజంతా మీటింగ్స్ నిర్వహించిన బండి సంజయ్
  • లక్ష్మణ్, వివేక్, విజయశాంతి, రాజాసింగ్, రఘునందన్, ఈటల రాజేందర్ హాజరు
     

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాదయాత్రపై బీజేపీ నేతలు భారీ కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు 9న హైదరాబాద్‌‌‌‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రను సక్సెస్ చేయడంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర నేతలు మంగళవారం పార్టీ స్టేట్ ఆఫీసులో సమావేశమయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ స్థాయిల నాయకులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడతలవారీగా సమావేశమై చర్చించారు. నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ముందుగా బీజేపీ సీనియర్ నేతలతో, తర్వాత ఆఫీసు బేరర్లతో, చివరకు జిల్లా అధ్యక్షులు, ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌లతో బండి సంజయ్ భేటీ అయ్యారు. పాదయాత్రకు సంబంధించిన కమిటీలు, రూట్ మ్యాప్, ఎన్ని రోజులు కొనసాగాలి, యాత్ర స్టార్ట్ చేసే రోజు జాతీయ నేతల్లో ఎవరిని ఆహ్వానించాలనే దానిపై చర్చించి, సీనియర్ల సలహాలు తీసుకున్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ పై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. అయితే మొదటి విడతలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో యాత్ర కొనసాగించాలని, రెండో విడతలో వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో మొత్తం 23 కమిటీలు వేయాలని డిసైడ్ అయ్యారు. సంజయ్‌‌‌‌తో జరిగిన సమావేశాల్లో పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, డీకే అరుణ, మంత్రి శ్రీనివాస్, జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. పాదయాత్రతో పాటు త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికపైనా సమావేశంలో చర్చించారు. పార్టీ నేతలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.

రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు

రాష్ట్రంలో అరాచక, నియంత, గడీలపాలన సాగుతోందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబ పాలనలో ప్రజలు దోపిడీకి గురవుతున్నారని, సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల కమీషన్లు, అడ్డగోలు అవినీతితో సంపాందించిన సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారని ఫైర్ అయ్యారు. అరాచక, నియంత పాలనకు వ్యతిరేకంగా ‘ప్రజాస్వామిక తెలంగాణ’ లక్ష్యంగా పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా ఈ పాదయాత్ర ద్వారా సర్కార్ పై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు. బీజేపీ చేపడుతున్న పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయని అన్నారు.

రానున్నది పేదల ప్రభుత్వం
2023లో బీజేపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వం వస్తుందనే ధీమా ప్రజల్లో ఏర్పడిందని బండి సంజయ్ అన్నారు. పాదయాత్ర ద్వారా సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి భాగోతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. పాదయాత్రలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు పాల్గొంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నామని, యాత్ర ముగింపు తేదీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతి ఒక్కరిని యాత్రలో భాగస్వాములను చేస్తామన్నారు. రోజూ వేల మంది కార్యకర్తలు పాల్గొంటారన్నారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి పాదయాత్ర అత్యంత కీలకం కానుందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారన్నారు.

తమ్ముడు.. నువ్వు గెలుస్తున్నవ్: విజయశాంతి
మీటింగ్ తర్వాత మాజీ ఎంపీ విజయశాంతి బయటకు వెళ్తూ ఈటలతో మాట్లాడారు. ‘‘తమ్ముడు.. హుజూరాబాద్ లో నువ్వు గెలుస్తున్నవ్. నీ కోసం ఎప్పుడంటే అప్పుడు ప్రచారానికి వస్త’’ అని ఆమె చెప్పారు.

యాత్ర నిర్ణయానికి మంచి స్పందన: ప్రేమేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి
పాదయాత్ర మొదలు పెట్టబోతున్నట్లు బీజేపీ ప్రకటించడంతోనే రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాలు, వివిధ ప్రాంతాల నుంచి మంచి స్పందన వచ్చిందని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. తమ ప్రాంతాల్లో కూడా యాత్ర చేపట్టాలని వివిధ జిల్లాలు, మండలాల నుంచి అడుగుతున్నారని, ఇందుకోసం పార్టీపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. ఈ స్పందన చూస్తే యాత్ర ఏడాది పొడవునా సాగే అవకాశం ఉందన్నారు.

టీఆర్ఎస్‌‌కు అభ్యర్థి దొరుకుతలే
హుజూరాబాద్ నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ కు అభ్యర్థే కరువయ్యారని, నియోజకవర్గ ప్రజలంతా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పక్షాన నిలిచారని బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలతో చేయించిన సర్వేలోనూ 71 శాతం మంది ఓటర్లు ఈటలకు మద్దతిస్తున్నట్లు తేలిందన్నారు. సర్వేలతో బెంబేలెత్తిపోయిన సీఎం కేసీఆర్.. అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులకు రూ.లక్షల ఆశ చూపి టీఆర్ఎస్ లోకి లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో కాషాయ జెండా ఎగురడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.