కర్నాటకలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బొమ్మై

కర్నాటకలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బొమ్మై

బాగల్‌కోట్:  కర్నాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని, తానే మళ్లీ సీఎంగా ప్రమాణం చేస్తానని బసవరాజ్ బొమ్మై అన్నారు. మంగళవారం రాత్రి ఉత్తర కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లా హుంగుండ్‌లో జరిగిన బహిరంగ సభలో బొమ్మై మాట్లాడారు. గత నాలుగేండ్లలో రాష్ట్రంలోని ప్రతి వర్గానికి సామాజిక న్యాయం అందించడానికి తాను చిత్తశుద్ధితో పనిచేశానని, ఫలితంగా వార్షిక తలసరి ఆదాయం రూ.1 లక్ష పెరిగిందని తెలిపారు. "మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, కర్నాటకలో తలసరి ఆదాయం ఏడాదికి రూ. 2.42 లక్షలుగా ఉంది, అది ఇప్పుడు రూ.3.47 లక్షలకు పెరిగింది. కరోనా సంక్షోభంలోనూ మేము దీనిని సాధించాం” అని ముఖ్యమంత్రి అన్నారు.

కర్నాటక తల్లికి సేవ చేసే అవకాశం దేవుడు తనకు ఇచ్చాడని బొమ్మై పేర్కొన్నారు. లింగాయత్ కమ్యూనిటీకి చెందిన ముఖ్యమంత్రి.. లింగాయత్ శాఖ స్థాపకుడు బసవేశ్వరుడు సూచించిన ‘పనియే ఆరాధన’, సామాజిక సమానత్వం అనే మార్గాల్లో తాను నడుస్తున్నానని అన్నారు.  బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల పెట్టుబడులు, ఆవిష్కరణలలో కర్నాటక ఫస్ట్​ప్లేస్​లో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సందర్భంగా రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే మళ్లీ బీజేపీనే ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.