కోర్టు తీర్పును స్వాగతిస్తున్నం: బీజేపీ

కోర్టు తీర్పును స్వాగతిస్తున్నం: బీజేపీ

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు చేసిన కామెంట్లను బీజేపీ సమర్థించింది. ఎన్నికల నిధుల్లో పారదర్శకత తీసుకురావడమే తమ లక్ష్యమని ప్రకటించిన కోర్టు అభిప్రాయాన్ని స్వాగతించింది. సుప్రీం కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు కొన్ని వందల పేజీల్లో ఉందన్నారు. తీర్పుపై సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ఫండింగ్ వ్యవహారంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. అలాంటి చర్యల్లో భాగమే ఎలక్టోరల్ బాండ్లు అని వివరించారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న కామెంట్లను ఆయన ఖండించారు. కార్పొరేట్ గ్రూపుల నుంచి బీజేపీ ఎలక్టోరల్ బాండ్లను లంచాల రూపంలో తీసుకుంటున్నదన్న కామెంట్లపై రవి శంకర్ ప్రసాద్ మండిపడ్డారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే అవినీతి ఉందని విమర్శించారు. లంచంపై ఆధారపడి పని చేసే పార్టీ కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ ఆరోపించారు.