అంతా చూస్తున్నం.. ఏ విషయంలోనూ ఆందోళన అవసరం లేదు: జేపీ నడ్డా

అంతా చూస్తున్నం.. ఏ విషయంలోనూ ఆందోళన అవసరం లేదు: జేపీ నడ్డా
  • బీజేపీ రాష్ట్ర నేతలతో ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా 
  • అరగంట పాటు రాష్ట్ర రాజకీయాలపై చర్చ
  • బీజేపీలో చేరిన మర్రి శశిధర్​రెడ్డి.. 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో రాజకీయ పరిణామాలన్నింటినీ హైకమాండ్ అబ్జర్వ్ చేస్తోందని, రాష్ట్రంలో జరుగుతున్నదంతా చూస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర నేతలకు తెలిపారు. ఏ అంశంలోనూ ఎలాంటి ఆందోళన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చారు. శుక్రవారం బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి..  రాష్ట్ర నేతలతో కలిసి నడ్డాను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డికి బీజేపీ కండువా కప్పి అభినందించారు. తర్వాత పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అరగంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది.

తెలంగాణ రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు, సిట్ నోటీసులు, బీఎల్ సంతోష్ కు నోటీసులపై హైకోర్టు స్టే, ఐటీ రైడ్స్ తదితర అంశాలను నేతలు నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, ఈ నెల 28 నుంచి భైంసా నుంచి ప్రారంభమయ్యే ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర గురించి తెలిపారు. డిసెంబర్ 17న కరీంనగర్ లో జరిగే ఈ యాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరు కాలని కోరారు.

ముగింపు సభలో పాల్గొనేందుకు నడ్డా సుముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ స్టేట్ చీఫ్ సంజయ్ తెలిపారు. టీఆర్ఎస్ నియంత, అవినీతి పాలనను అంతం చేస్తే తప్ప.. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరవని బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బోగస్ అన్నారు. ఇది కేసీఆర్ సృష్టించిన కేసని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు తీసుకువచ్చిన డ్రామా అని కొట్టిపారేశారు.

లిక్కర్ స్కాంలో తన ప్రమేయం లేదని కవిత నిరూపించుకోవాలని చెప్పారు. నడ్డాతో భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర జలవనరులశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్, ఎంపీలు కె.లక్ష్మణ్, సంజయ్, అర్వింద్,  ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్ర నాయక్   ఉన్నారు.

మర్రి రాకతో మరింత మంది చేరుతరు: వివేక్ వెంకటస్వామి

బీజేపీలో చేరిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ వివేక్ వెంకటస్వామి అభినందనలు తెలిపారు. మర్రి చేరిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. బొకే ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత వివేక్ మీడియాతో మాట్లాడారు. తండ్రి మర్రి చెన్నారెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన శశిధర్ రెడ్డి మచ్చలేని మనిషిగా పేరుతెచ్చుకున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షల కోసం అనేక పోరాటాలు చేశారన్నారు.

తెలంగాణలో నీళ్ల సమస్యపై ప్రధానంగా ఆయన చేసిన ఉద్యమాలను గుర్తు చేశారు. ప్రజల కోసం సొంత పార్టీ నేతల్ని కూడా ప్రశ్నించే తత్వం ఆయన సొంతమన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని అవినీతి కేసీఆర్ పాలనలో ఉందన్న మర్రి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్​కు వ్యతిరేకంగా బీజేపీ చేస్తోన్న పోరాటంలో తమతో కలిసి రావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన రాకతో మరికొంత మంది పార్టీలో చేరుతారని తెలిపారు.