కాంగ్రెస్​లోకి బీజేపీ హిసార్ ఎంపీ

కాంగ్రెస్​లోకి బీజేపీ హిసార్ ఎంపీ
  •  రాజకీయ కారణాల వల్లే: బ్రిజేంద్ర సింగ్

చండీగఢ్: హిసార్  నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ బ్రిజేంద్ర సింగ్  కాంగ్రెస్  పార్టీలో చేరారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు లోక్ సభ సభ్యత్వానికీ ఆయన రాజీనామా చేశారు. ట్విటర్ లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. అనంతరం ఢిల్లీలోని కాంగ్రెస్  చీఫ్​ మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్  కోశాధికారి అజయ్  మాకెన్, పార్టీ సీనియర్  లీడర్  ముకుల్  వాస్నిక్  ఆయనను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. ఈ సందర్భంగా మీడియాతో బ్రిజేంద్ర సింగ్  మాట్లాడారు. 

రాజకీయ కారణాల వల్లే బీజేపీకి రాజీనామా చేశానని చెప్పారు. భావజాల అంశాలతో పాటు రైతులు, అగ్నివీర్  సమస్యలు, మహిళా రెజ్లర్లతో కేంద్రం వ్యవహరించిన విధానం వంటి కారణాలతో బీజేపీకి తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఎంతో కష్టంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఎంపీగా తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్  షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

తమ డిమాండ్లను పార్లమెంట్ లో లేవనెత్తే అవకాశం కల్పించినందుకు హిసార్  ప్రజలకూ ఆయన థ్యాంక్స్  చెప్పారు. ప్రజాసేవలో తన ప్రస్థానం కొనసాగుతుందని మాజీ ఐఏఎస్  కూడా అయిన బ్రిజేంద్ర సింగ్  తెలిపారు.