- బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రఘునాథ్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల–అంతర్గాం మధ్య గోదావరిపై మంజూరైన బ్రిడ్జిని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తన స్వార్థ ప్రయోజనాల కోసం రద్దు చేయించారని బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెరబెల్లి రఘునాథ్ రావు విమర్శించారు. ప్రజల సౌకర్యార్థం వెంటనే బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రదేశంలోనే గోదావరిపై వంతెన నిర్మించాలన్నారు.
ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తే బస్సుల్లో వెళ్లే పేదలకు రవాణా చార్జీలు తగ్గుతాయన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పది సంవత్సరాలు వంతెన నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు తన స్వార్థం కోసం బ్రిడ్జిని రద్దు చేయించారని విమర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, లీడర్లు దుర్గం అశోక్, వెంకటేశ్వర్ రావు, ఎ.కృష్ణమూర్తి, కమలాకర్ రావు, కె.రమేశ్, కె.నాగరాజు, బొట్ల అనిత తదితరులు పాల్గొన్నారు.

