దిగ్విజయ్ కి షాకిచ్చిన యువకుడికి బీజేపీ సన్మానం

దిగ్విజయ్ కి షాకిచ్చిన యువకుడికి బీజేపీ సన్మానం

దిగ్విజయ్ సింగ్ తో పాటు వేదిక పంచుకున్న యువకుడిని బీజేపీ బుధవారం సన్మానించింది. రెండు రోజుల క్రితం భోపాల్ లోక్ సభ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ భోపాల్ లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా ఓ సభలో పాల్లోన్న దిగ్విజయ్.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధానిగా మోడీ దేశానికి ఏం చేశారని సభలో ప్రజలనుద్దేశించి ప్రశ్నించాడు.

ఈ క్రమంలో దిగ్విజయ్ పిలవడంతో జనంలో ఉన్న అమిత్ మాలి అనే వ్యక్తి వేదికపైకి వచ్చి మోదీ సర్జికల్ దాడులు నిర్వహించి ఉగ్రవాదులను మట్టుబెట్టారని చెప్పాడు. ఈ మాటలతో ఖంగు తిన్న కాంగ్రెస్ కార్యకర్తలు అమిత్‌ను వెంటనే వేదికపై నుంచి కిందకు దించేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోను చూసిన బీజేపీ నేతలు, అమిత్‌పై ప్రశంసలు కురిపించడమే కాకుండా అతన్ని తమ పార్టీ కార్యాలయానికి రప్పించి మరీ సన్మానించింది.

ఈ సందర్భంగా అమిత్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ సభలో భాగంగా దిగ్విజయ్, ఎవరికైనా తమ అకౌంట్లలో రూ.15 లక్షలు జమ అయ్యాయా? అని ప్రశ్నించినపుడు తాను చెయ్యి పైకెత్తానని, దీంతో తనను వేదిక పైకి పిలిచారన్నారు. ఆ సమయంలోనే తాను సర్జికల్ దాడుల గురించి మాట్లాడటంతో తనను స్టేజిపై నుంచి కిందకు పంపేశారన్నారు. అయినప్పటికీ అక్కడున్న వారు ఎవరూ కూడా తనతో అనుచితంగా ప్రవర్తించలేదని అమిత్ తెలిపారు.