నాలుగురోజుల పాటు రాష్ట్రంలో తరుణ్ చుగ్ పర్యటన

నాలుగురోజుల పాటు రాష్ట్రంలో తరుణ్ చుగ్ పర్యటన

రాష్ట్రంలో నాలుగు రోజులపాటు బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా బీజేపీ బలోపేతానికి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష చేయనున్నారు. సెప్టెంబరు 17 న నిర్వహించే బహిరంగ సభపై రాష్ట్ర ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఈటల రాజేందర్ ను తరుణ్ చుగ్ పరామార్శించనున్నారు. ఆ తర్వాత జనగామలోని రఘునాథపల్లెలో పార్టీ కార్యకర్త ఇంట్లో టీ తాగుతారు. అక్కడి నుంచి బీజేపీ స్టేట్ ఆఫీసుకు వెళ్లి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమై పార్టీ బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఆదివారం ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి అదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో సమావేశంకానున్నారు. సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం సహా హైదరాబాద్ నేతలతో సమీక్ష చేయనున్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో భేటీ కానున్న చుగ్ అదేరోజు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. 

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు

ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర హోంశాఖ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సికింద్రాబాద్​లోని పరేడ్​గ్రౌండ్​లో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అమిత్ షా, కర్నాటక, మహారాష్ట్ర సీఎంలు బసవరాజ్ బొమ్మై, ఏక్ నాథ్ షిండే హాజరుకానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్​ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. కేంద్ర పరిధిలోని సాయుధ బలగాలతో పరేడ్, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. 17న తెలంగాణ విమోచన వేడుకలు రాష్ట్ర సర్కారు అధికారికంగా నిర్వహించాలని మొదట్నుంచీ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తున్నా..టీఆర్ఎస్ పట్టించుకోకపోవడంతో ప్రతిసారీ బీజేపీనే నిర్వహిస్తోంది. ఇపుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నిర్వహించాలన్న నిర్ణయం కేసీఆర్ సర్కారును ఇరకాటంలో పడేసేందుకేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.