తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ

తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ
  • కీలక కమిటీల్లో లక్ష్మణ్​కు చోటు
  • మొన్ననే యూపీ నుంచి ఎంపీగా నామినేట్​
  • ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్​ ఎలక్షన్​ కమిటీలో సభ్యుడిగా అవకాశం
  • ఇటీవల పార్టీ కొత్త ఇన్​చార్జ్​గా బన్సల్​ నియామకం
  • ఆరు రోజుల వ్యవధిలో రెండు భారీ సభలకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్​ ఫోకస్​ పెటింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ డా. కె.లక్ష్మణ్ కు రెండు కీలక కమిటీల్లో చోటు కల్పించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఆయనను సభ్యుడిగా బుధవారం నియమించింది. రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని లక్ష్మణ్​ తాజా నియామకం మరోసారి స్పష్టం చేసింది. దాదాపు రెండేండ్లుగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనను రెండు నెలల కిందనే హైకమాండ్​ ఉత్తరప్రదేశ్​ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇప్పుడు కీలకమైన రెండు కమిటీల్లోనూ అవకాశం ఇవ్వడం రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నది. ఉత్తరప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించిన సునీల్​ బన్సల్​ను ఇటీవల పార్టీ తెలంగాణ ఇన్​చార్జ్​గా నియమించింది. 

పకడ్బందీ ప్రణాళికతో ముందుకు..!
2019 లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటి నుంచి తెలంగాణపై బీజేపీ హైకమాండ్​ దృష్టి సారించింది. పార్టీ బలోపేతానికి పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తూ వస్తున్నది. 2019 లోక్​సభ ఎన్నికల టైమ్​లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్​  ఉన్నారు.  ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్​ని నియమించినప్పటికీ.. కొన్నిరోజులకు లక్ష్మణ్​కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ జాతీయ నాయకత్వం అవకాశం ఇచ్చింది.

సికింద్రాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికైన కిషన్ రెడ్డికి మొదట కేంద్ర కేబినెట్ లో సహాయ మంత్రిగా, సంవత్సరానికే కేబినెట్ హోదా ఇచ్చి కీలaక శాఖలు అప్పగించింది. తెలంగాణ విషయంలో హైకమాండ్ చూపిస్తున్న స్పెషల్ ఇంట్రస్ట్ కు ఇదో ఉదాహరణ. ఇటీవలే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించడం, ముగింపు సభను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుపడం...ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్​ నేతలు ఇచ్చిన స్పీచ్ లు కేడర్​లో ఫుల్ జోష్  నింపాయి. బండి సంజయ్ చేపట్టిన మొదటి, రెండవ విడతల పాదయాత్రకు జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు వరుసపెట్టి రాష్ట్రంలో పర్యటించారు. మే నెలలో ఐఎస్ బీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన మోడీ.. బేగంపేట ఎయిర్ పోర్టులో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ రెండో విడత పాదయాత్రలో మహబూబ్ నగర్ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాగా,  ముగింపు సభను తుక్కుగూడలో నిర్వహించగా దానికి చీఫ్ గెస్ట్ గా అమిత్ షా హాజరయ్యారు.  

వరుస విజయాలతో..
రెండేండ్ల కింద జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లను బీజేపీ గెలుచుకొని జోరు కొనసాగిస్తున్నది. దుబ్బాక, హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. మునుగోడులోనూ సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామన్న ధీమాలో ఉన్నారు.  

ఆరు రోజుల్లోనే రెండు భారీ సభలు
ఆరు రోజుల్లోనే  రెండు భారీ సభలకు బీజేపీ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో ఒకటి రాజగోపాల్​రెడ్డి చేరికకు సంబంధించింది. మరొకటి ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభ. కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ నెల 21 మునుగోడు సభలో బీజేపీలో చేరనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా అమిత్ షా రానున్నారు. ఈ నెల 27న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ జరుగనుంది. వరంగల్​లో జరగనున్న ఈ సభకు జేపీ నడ్డా లేదా యోగి ఆదిత్యనాథ్​లో ఎవరో ఒకరు హాజరవుతారని లీడర్లు చెప్తున్నారు.  ఇలా వరుసగా.. సభలు, సమావేశాలు, లీడర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ హైకమాండ్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది.

మరింత బాధ్యత పెరిగింది: లక్ష్మణ్
పార్లమెంటరీ బోర్డుతో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో తనకు జాతీయ నాయకత్వం చోటు కల్పించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని ఎంపీ కె. లక్ష్మణ్​ అన్నారు. హైదరాబాద్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో సామాన్య కార్యకర్త ఏ స్థాయికి వెళ్లగలడో అనేదానికి తానే  నిదర్శనమని చెప్పారు. ‘‘వెంకయ్య నాయుడు తర్వాత ఏపీ, తెలంగాణలో నాకే ఈ అరుదైన గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది.

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టిందనడానికి ఇదే నిదర్శనం. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలనను అంతమొందించడమే బీజేపీ లక్ష్యం. ప్రజలు కూడా అదే ఆలోచనతో ఉన్నరు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నరు” అని ఆయన పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, హుజూరాబాద్, దుబ్బాక మాదిరిగానే ఈ ఉప ఎన్నికలోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తే తప్ప సీఎం కేసీఆర్ కు సంక్షేమ పథకాలు గుర్తుకురావని లక్ష్మణ్​ విమర్శించారు.