
బషీర్బాగ్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నాయని అఖిల భారత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఈ నెల 17న రవీంధ్రభారతిలో ‘ది మిషన్ టు సేవ్ ది కాన్సిస్ట్యూషన్’ అంశంపై నేషనల్ సెమినార్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్ అబిడ్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. సెమినార్కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. సెమినార్ అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామిని సన్మానించనున్నట్లు మహేశ్వర్ రాజ్ తెలిపారు. ఈ సమావేశంలో సమాఖ్య నాయకులు జి.ఆనంద్ కుమార్, చంద్రప్రభ, సుశీలకుమారి, టి.గణేశ్, దుర్గేశ్నందిని, జె.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.