ఎస్సీ, ఎస్టీ స్థానాలపై బీజేపీ ఫోకస్ .. రిజర్వ్​డ్​ ఎంపీ సీట్లలో గెలుపు కోసం ప్లాన్

ఎస్సీ, ఎస్టీ స్థానాలపై బీజేపీ ఫోకస్ .. రిజర్వ్​డ్​ ఎంపీ సీట్లలో  గెలుపు కోసం ప్లాన్

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని మూడు ఎస్సీ, రెండు ఎస్టీ లోక్​సభ సీట్లపై బీజేపీ కన్నేసింది. ఎస్సీ, ఎస్సీల సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయా నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేందుకు ప్లాన్​ చేస్తున్నది. ఇదే సమయంలో ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ హామీ అంశాన్ని, పోడు భూముల కోసం గిరిజనుల తరఫున బీజేపీ చేసిన పోరాటాన్ని ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది.  

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాల్లో బీజేపీ ఒక్క సీటునూ గెలుచుకోలేదు. లోక్​సభ ఎన్నికల్లో ఓటింగ్​ సరళి భిన్నంగా ఉంటుందని భావిస్తున్న పార్టీ పెద్దలు.. ఆ రెండు వర్గాల కోసం ఇటీవల పార్టీ తీసుకున్న నిర్ణయాలు వర్కవుట్​ అవుతాయని భావిస్తున్నారు. 2019  లోక్​సభ ఎన్నికల్లో  రాష్ట్రంలో బీజేపీ ఒక ఎస్టీ సీటుతోసహా నాలుగు  సీట్లను గెలుచుకుంది. 

ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు గెలుపొందారు. తిరిగి ఆ సీటును నిలబెట్టుకోవడంతోపాటు మరో ఎస్టీ సీటు మహబూబాబాద్ ను ఖాతాలో వేసుకోవడంపై కమలం పార్టీ నేతలు దృష్టి పెట్టారు. రాష్ట్రంలో  మూడు ఎస్సీ స్థానాలైన పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్​లో గెలుపు కోసం బీజేపీ ప్లాన్​ చేస్తున్నది. ఒక్కో ఎస్సీ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆ పార్టీ హైకమాండ్.. లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నది. 

10 ఎంపీ సీట్లు.. 35 శాతం ఓట్లు టార్గెట్​

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగా, ఆ తర్వాత కేవలం నాలుగు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లను దక్కించుకోవడంతో.. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ సీట్లను సాధించడంపై ఢిల్లీ పెద్దలు ఫోకస్ పెట్టారు. ఇప్పుడున్న నాలుగు సిట్టింగ్ లను రెండింతలకు పెంచుకునే లక్ష్యంతో జాతీయ నాయకత్వం ఉంది. ఇందులో భాగంగానే ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చి లోక్ సభ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.