బీజేపీ జాతీయ నాయకులు బన్సల్, తరుణ్ చుగ్ హాజరు
ఈ నెల 20 నుంచి ఎస్సీ రిజర్వ్ డ్ సెగ్మెంట్లలో నేతల పర్యటన
హైదరాబాద్: బీజేపీ 31 రిజర్వ్ సెగ్మెంట్లలో గెలుపుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దళిత, గిరిజన సామాజిక వర్గాల రిజర్వుడ్ స్థానాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ల కన్వీనర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వ్ డ్ సెగ్మెంట్లున్నాయి. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు కన్వీనర్లుగా ఉన్నారు.ః
ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ 31 సెగ్మెంట్ల బాధ్యులతో సమావేశం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం.. స్థానికంగా ప్రభావితం చూపే అంశాలపై నియోజకవర్గాల వారీగా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు హాజరయ్యారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 15 వరకు ఎస్సీ రిజర్వుడ్ సెగ్మెంట్లలో బీజేపీ నేతలు పర్యటించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.