
- ఒకట్రెండు రోజుల్లో కీలక కమిటీల ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధమవుతున్నది. ఇందుకోసం హైకమాండ్ ‘ఎలక్షన్ టీమ్’ను రెడీ చేస్తున్నది. ఈ టీమ్ ఏర్పాటు కొలిక్కి వచ్చిందని, ఒకట్రెండు రోజుల్లో కీలక కమిటీల ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి అమిత్ షా వచ్చే లోపు టీమ్‌ను రెడీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంటున్నాయి.
మూడు నుంచి ఐదు కమిటీలు
వారం రోజులుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోష్ తదితరులు ఢిల్లీలో పలు దఫాలుగా భేటీ అయ్యారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో పార్టీ గెలుపు అవకాశాలపై చర్చించేందుకు సమావేశమైనా.. ప్రధానంగా తెలంగాణపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీల నుంచి రెండేండ్లుగా బీజేపీలోకి చేరికల ప్రవాహం పెరిగింది.
ఇందులో చాలా మంది ప్రజాబలం ఉన్న నేతలు ఉన్నారు. అలాంటి నేతలకు ఈ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించి, వారి సేవలను పార్టీ గెలుపు కోసం వినియోగించుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ, ఎలక్షన్ క్యాంపెయిన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, కో ఆర్డినేషన్ కమిటీ.. తదితర మూడు నుంచి ఐదు కమిటీలను కొత్తగా ఏర్పాటు చేయాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. వీటిపై సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన కనీసం ఐదుగురు బలమైన నేతల సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఈ కమిటీల బాధ్యతలను వారికి అప్పగించేందుకు జాతీయ నాయకత్వం సిద్ధమైంది.
ఎవరికి? ఏ బాధ్యత?
రాష్ట్ర బీజేపీలో సంస్థాగత మార్పులపై రకరకాల ప్రచారం సాగుతుండడం, మీడియాలో అనేక కథనాలు రావడంతో పార్టీ క్యాడర్ కొంత కన్ఫ్యూజన్‌కు గురైంది. దీనికి తెర దించేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ ఇటీవల రాష్ట్రానికి వచ్చారు. కొందరు కీలక నేతలతో విడివిడిగా సమావేశమై.. వారికి పార్టీలో అప్పగించే బాధ్యతలపై చర్చించారు. కొందరు నేతలను ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు మీ పాత్ర ఎలా ఉండాలి? పవర్లోకి వచ్చిన తర్వాత మీకు ఉండే ప్రాధాన్యత ఏమిటి? వంటి విషయాలపై ఆయా నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఎవరికి, ఏ బాధ్యత అప్పగించాలనే విషయంపై జాతీయ నాయకత్వం ఓ క్లారిటీకి వచ్చింది. ఒకట్రెండు రోజుల్లో కీలకమైన ఎలక్షన్ కమిటీల ఏర్పాటు, ఏ నేతకు ఏ బాధ్యత అనేది ఢిల్లీ నుంచి ప్రకటన వెలువడనుంది. ఖమ్మం బహిరంగ సభలో పాల్గొనేందుకు రాష్ట్ర పర్యటనకు ఈ నెల 15న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. ఆ లోపే కీలకమైన ఎలక్షన్ కమిటీల బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించేందుకు కేంద్ర నాయకత్వం సిద్ధమైంది. తన పర్యటనలో ఈ కీలక టీమ్స్ బాధ్యులతో అమిత్ షా భేటీ అయ్యే ఏర్పాట్లు కూడా సాగుతున్నాయని ఓ లీడర్ చెప్పారు.