
హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్ 17న జరిగే విమోచన వేడుకలకు బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. ఓల్డ్ సిటీ నుంచి సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనుంది. పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ‘తెలంగాణ జాతీయ సమైక్యత’ ఉత్సవాలు జరగనున్నాయి.
16న సాయంత్రం అమిత్ షా రాక
అమిత్ షా ఈ నెల 16 సాయంత్రం హైదరాబాద్కు చేరుకుంటారు. ఆరోజు రాత్రి పార్టీ ముఖ్యులతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. 17న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పరేడ్ గ్రౌండ్లో జరిగే విమోచన వేడుకల్లో పాల్గొంటారు. జాతీయ జెండాను ఎగురవేసి..కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత సభలో మాట్లాడుతారు. విమోచన వేడుకలు సక్సెస్ చేసే బాధ్యతను బీజేపీ రాష్ట్ర నాయకత్వం మహిళా, యువ మోర్చాలకు అప్పగించింది. విమోచన వేడుకల తర్వాత 500 మంది బీజేపీ ముఖ్య నాయకులతో బోయిన్‌పల్లిలో అమిత్ షా సమావేశం కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వానికి దిశా నిర్దేశం చేయనున్నారు.