- పార్టీ శ్రేణులకు బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని బీజేపీ అధిష్టానం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఇందులో భాగంగా కొత్త ఓటర్లు, అర్హులందరికీ ఓటర్ నమోదు ప్రక్రియలో సహకారం అందించాలని సూచించింది. ఈ మేరకు శనివారం ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో బీజేపీ ‘సర్’ ప్రక్రియపై వర్క్ షాపు నిర్వహించింది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో జరిగిన ఈ వర్క్ షాపులో నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) బీఎల్ సంతోష్, తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, శశిధర్ రెడ్డి, వేముల అశోక్‌తో పాటు ‘సర్’ నిర్వహించనున్న 22 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు సహకరించాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, దీన్ని వినియోగించుకునేలా ప్రజలను చైతన్యపరచాలన్నారు. ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్, ఇతర విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ‘సర్’ ప్రక్రియపై అబద్ధాలను వ్యాప్తి చేస్తూ, రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు
