ఆర్టీసీ కార్మికులతో పెట్టుకోవడం అంటే అగ్గితో గోక్కున్నట్లే

ఆర్టీసీ కార్మికులతో పెట్టుకోవడం అంటే అగ్గితో గోక్కున్నట్లే

హైదరాబాద్, వెలుగు: ‘చలో ట్యాంక్ బండ్’ కార్యక్రమానికి వచ్చిన ఆర్టీసీ మహిళా కార్మికులపై లాఠీచార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ తీవ్రంగా ఖండించారు. ఆ మహిళల ఆక్రందనలు ఊరికేపోవని, వారి ఉసురు సీఎం కేసీఆర్​కు తప్పక తగులుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని, ఆర్టీసీ సమ్మెకు ప్రజల మద్దతు ఉన్న విషయాన్ని  గుర్తించాలని హితవుపలికారు. లేకపోతే ఆర్టీసీ సమ్మె కేసీఆర్ సర్కార్ పాలిట ఉరితాడుగా మారుతుందని ఆయన హెచ్చరించారు. హిట్లర్ ను తలపించే రీతిలో కేసీఆర్ పాలన ఉందని, నియంతల పాలనలు ఎక్కువ రోజులు ఉండవనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆర్టీసీ కార్మికులు దసరా, దీపావళి పండుగలు జరుపుకోలేక ఆకలితో అలమటించాల్సి రావడం బాధాకరమన్నారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకోవడం అంటే అగ్గితో గోక్కున్నట్లేనని, అది ఒళ్లును కాల్చేస్తుందనేది విషయాన్ని గ్రహించాలని సీఎం కేసీఆర్ కు హితవుపలికారు. సమైక్య పాలనలో కూడా ఇన్ని ఆంక్షలు లేవని, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడినైన తననే హౌజ్ అరెస్ట్ చేస్తారా?  అని లక్ష్మణ్ మండిపడ్డారు. తానేమైనా టెర్రరిస్టునా?  ప్రజాస్వామ్యవాదులను బయటకు వెళ్లనీయరా? అని నిలదీశారు.

అసద్​కు దేనిపైనా నమ్మకం లేదు

అయోధ్య తీర్పుపై మజ్లిస్ చీఫ్​ అసదుద్దీన్​ వ్యాఖ్యలను లక్ష్మణ్​ తప్పుబట్టారు. సున్నీ వక్ఫ్ బోర్డు కూడా తీర్పును ఆమోదిస్తే, అయోధ్యలో 5 ఎకరాల భూమిని భిక్ష వేస్తున్నారా అని అసద్  అనడం ఏమిటని ప్రశ్నించారు. అసద్ ఓ విచిత్రమైన వ్యక్తి అని, ఆయన పార్టీకి, వ్యాపారాలకు మాత్రం ప్రభుత్వ భూములు కావాలని ఎద్దేవా చేశారు. ఆయనకు కోర్టులు, వ్యవస్థలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మీద.. ఇలా దేనిపై కూడా నమ్మకం లేదని లక్ష్మణ్​ దుయ్యబట్టారు.

ఒకరిద్దరికి ఇబ్బందిగ ఉన్నట్టుంది

అయోధ్య తీర్పును అన్ని వర్గాలు స్వాగతించాయని, అయితే ఒకరిద్దరు నేతలకు ఈ తీర్పు ఇబ్బందిగా ఉన్నట్టుందని లక్ష్మణ్​ అన్నారు. ఎప్పుడూ యాగాలు చేసే నేత కూడా ఈ తీర్పుపై స్పందించలేదంటూ సీఎం కేసీఆర్ తీరును ఆయన తప్పుపట్టారు. దశాబ్దాల సమస్యకు  ముగింపు పలికే ఈ తీర్పు దేశ న్యాయ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.  జఠిలమైన సమస్యలను పరిష్కరించే సత్తా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికే ఉందని చెప్పారు. ప్రధాని మోడీ కారణజన్ముడని, రాష్ట్ర పార్టీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు చెపుతున్నామన్నారు.